Karthika Pournami 2022: ప్రపంచంలో పండగలను ఎంతో నిష్టగా జరుపుకునేది కేవలం భారతదేశ ప్రజలే కావచ్చు. కాలానుగుణంగా వచ్చే సంకేతాల ప్రకారం పండుగలు జరుపుకోవడం భారతీయుల విశిష్టత. ఇక పండగలన్నీ పర్యావరణ క్షేమాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడేవే. కార్తీక పౌర్ణమి కూడా అలాంటిదే.. ఇది స్త్రీలకు మాంగల్య సౌభాగ్యాన్ని, దీర్ఘకాల దాంపత్యాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ ఆలయంలో 365 వత్తులతో అఖండ దీపం వెలిగిస్తారు.. ఇలా చేయడం వల్ల ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది.. చలిని నియంత్రించి, దేహానికి వేడినిచ్చే పదార్థాలయిన చలిమిడి, అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. దీపాలను వెలిగించడం వల్ల వాతావరణంలో ఉండే తేమ తగ్గి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవు. తులసి, రావి, ఉసిరి చెట్ల కింద దీపాలు వెలిగించడంలో ఇవి విడుదల చేసే ఆక్సిజన్ వల్ల దీపాలు ఎక్కువసేపు ప్రజ్వరిల్లి గాలిలో తేమను హరిస్తాయని ప్రతితీ. కార్తీక మాసం సందర్భంగా రోజున 11 ఉసిరికాయలను బ్రాహ్మణులకు దానం ఇస్తే విశేష పుణ్యం లభిస్తుంది అంటారు. కేదారేశ్వర వ్రతం కూడా ఈ రోజున నిర్వహిస్తారు.. ఇక శైవ క్షేత్రాల్లో భరణి దీపం, అఖండ దీపం వెలిగిస్తారు. శివుడు త్రిపురాసురులను సంహరించింది ఈరోజే అని పురాణాలు చెబుతున్నాయి. 14వ మనువైన భౌత్యున్ని మన్వంతరం కూడా మొదలైంది ఈ కార్తీక పున్నమి రోజునే. ఈ రోజున వెలిగించే జ్వాలాతోరణాన్ని చూస్తే యమలోక ప్రాప్తి ఉండదని పురాణాలు చెబుతున్నాయి.

ఈ పున్నమి నాడు శివుణ్ణి చూడొచ్చు
కార్తీక పౌర్ణమి శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది.. ఈ మాసంలో ఎంతో నిష్టగా శివుడికి పూజలు జరిపిస్తారు.. అయితే చాలామందికి కూడా మహాశివుని నేరుగా చూడాలి అనే కోరిక ఉంటుంది.. అయితే అది ఎంతో సులభం కూడా. భౌమేశ్వరుడు భూమి, ఉదకభవుడు జలం, రుద్రుడు అగ్ని, ఉగ్రుడు వాయువు, భీముడు ఆకాశం, పశుపతి మనలో ఉండే ఆత్మ, ఈశానుడు సూర్యుడు, మహాదేవుడు చంద్రుడు.. ఇవన్నీ కూడా శివుడి అష్టరూపాలు.. వీటిలో పశుపతిని దర్శించేందుకు మాత్రమే తీవ్ర కృషి అవసరం.. మిగిలిన ఏడు రూపాలు నిత్యం మనం చూసేవే. ఇక వరాహ కల్పం ఏడవ వైవ స్వతంలో శివుడు శ్వేతాచార్యుడిగా, రెండో ద్వాపరాంతంలో సుతారుడు అనే యోగిగా, మూడో ద్వాపరంలో ధమనుడు అనే రుషిగా జన్మించాడు. అలా సుహోత్రుడు, కంకుడు, లోకాక్షి దధి వాహనుడు, రుషభుడు… ఇలా ఒక్కొక్క ద్వాపరంలో అవతారాలు ధరించాడు.

వచ్చే 19 ద్వారకల్లో..
ఇక వచ్చే 19 ద్వాపరయుగంలో శివుడు వరుసగా తపోధన, అత్రి, బలి, గౌతమ, వేద, శిర, గోకర్ణ, గుహ వాసు, శిఖండి, మాలీ, అట్టహాసుడు, దారకుడు, లాంగలీశ, శ్వేత యోగి, శూలి, దండి, సహిష్ణు, సోమ శర్మ, కులీశ పేర్లతో అవతరించాడు. శివపురాణం ప్రకారం శివుడికి 116 అవతారాలు ఉన్నాయి. దేవుళ్లకు ఇన్ని అవతారాలు ఎందుకని సందేహం మనకు కలగడం సాధారణం. “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అన్నారు. పరమాత్మ తనను భిన్నమైన రూపాల్లో చూసుకుంటాడు. సర్వ జీవుల్లో తనను ప్రతిఫలింప చేసుకుంటాడు. “సర్వం ఖల్విదం బ్రహ్మ” అన్నారు కదా! అంటే లోకంలో ఉన్నది మొత్తం బ్రహ్మమేనని భావం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఆర్యోక్తి. ఈ సకల జగత్తులో అంతటా శివుడే వ్యాపించి ఉన్నాడు. ఆ శివుడే లయకారుడు. అతని లయలే మనలోని అన్ని లక్షణాలను ప్రతిఫలిస్తాయి. ఈ కార్తీక మాస సందర్భంగా శివుడికి నిష్ఠతో పూజలు చేస్తే సకల లాభాలు వ
ఒనగూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.