
Sri Ramanavami Vratam : శ్రీరాముడు జన్మించిన రోజు శ్రీరామనవమి. ఇది చైత్ర మాసం శుక్ల పక్షం నవమి నాడు వస్తుంది. శ్రీరాముడు ఆదర్శాలకు పెట్టిందిపేరు. మంచి భర్తగా, మంచి అన్నగా, మంచి కొడుకుగా బహుముఖ పాత్రలు పోషించి తనలోని విశేష గుణాలు చాటాడు. సకల కళా గుణాభిరాముడిగా శ్రీరాముడు కీర్తించబడ్డాడు. రామాయణం ఓ అద్భుత కావ్యం. అది నిజమైతే అద్భుతం. అబద్ధమైతే మహాద్భుతం అని అన్నారో కవి. అలా రామాయణం ఎన్ని యుగాలైనా అందులోని విశిష్టతలు ఇప్పటికి ఆచరణీయమే. ఒకే మాట, ఒకే బాట, ఒకే పత్నిగా రాముడి జీవితం ఆదర్శాలమయం. ఇలా రామాయణంలో ఎన్నో మనకు ఆదర్శంగా నిలిచే సందర్భాలు కనిపిస్తాయి.
దేశంలోని..
శ్రీరామ కల్యాణం దేశంలోని అన్ని ఆలయాల్లో వైభవంగా నిర్వహిస్తారు. అందరు శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం మూలలో అందమైన మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో శ్రీరామ పట్టాభిషేకం పటాన్ని ఉంచి సీతారామ, లక్ష్మణ, హనుమాన్లు ఉన్నటువంటి చిత్రాన్ని మండపంలో పెట్టి నిష్టగా పూజించాలి. పూలు, కుంకుమ, పసుపు, అక్షింతలు, గంగాజలంతో రాముడికి పూజలు చేసి నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి.
ఏ పూలతో పూజించాలి
రాముడికి ఎర్రని పూలంటే ఇష్టం. అందుకే ఎర్రటి పూలతో పూజ చేస్తే స్వామి వారు సంతోషిస్తారు. శ్రీరాముడిని పూజించే ముందు ఆంజనేయుడికి పూజ చేయాలి. రాముడికి ఇష్టమైన పండు సీతాఫలం నైవేద్యంగా పెడితే మంచిది. రాముడి కోసం తయారు చేసిన నైవేద్యం పానకం, వడపప్పు పెట్టి కొలవాలి. ఈ రోజు వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాస దీక్ష చేయాలి. పాలు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. రోజంతా శ్రీరామ మంత్రం పఠిస్తూ కాలం గడపాలి.
అన్నదానం
శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించే వారు అన్నదానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వృద్ధులు, ఉపవాసం చేయలేని వారు ఒక పూట భోజనం చేయొచ్చు. ప్రతి ఒక్కరు రాముడి మీద మనసు పెట్టి వ్రతం ఆచరిస్తే శుభాలు కలుగుతాయి. నిష్టగా పూజించి ఉపవాస దీక్ష ఆచరించే వారికి పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. జన్మజన్మల పాపాలు తొలగి పాప విముక్తులు అవుతారని విశ్వసిస్తారు. ఇలా రాముడి కోసం పూజలు చేసిన వారికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.