Tulasi Plant: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చెట్టు తులసి. ప్రతి ఇంట్లో దాదాపు తులసి చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం కొందరు ఆడవాళ్లు తులసి చెట్టుకు పూజ చేస్తూ ఉంటారు. కొందరు పురుషులు సైతం తులసి చెట్టుకు నీరు పోసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయితే ఇంట్లో తులసి చెట్టు ఏర్పాటు చేసుకున్న తర్వాత కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలు పాటించకపోవడం వల్ల అరిష్టాలు జరిగే అవకాశం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు. ఇంతకీ తులసి చెట్టు ఏర్పాటు చేసుకునే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి?
చాలామంది ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. కానీ ఈ చెట్టును కొందరు పెద్దగా పట్టించుకోరు. ఇంట్లో తులసి చెట్టు ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే. అయితే ఒక తులసి చెట్టు కాకుండా రెండు తులసి చెట్లను ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో ఒకటి కృష్ణ తులసి, మరొకటి లక్ష్మి తులసి. లక్ష్మి తులసి ఆకులు పచ్చగా ఉంటాయి. కృష్ణ తులసి ఆకులు నీలం రంగులో ఉంటాయి. ఈ రెండు ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో తాండవం చేస్తుందని చెబుతారు. అయితే తులసి చెట్టును ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోనివ్వదు. అనుకోకుండా తులసి చెట్టు కొన్ని ఆకులు పాడైపోయినట్లు కనిపిస్తే వెంటనే కొత్త తులసిని ఏర్పాటు చేసుకోవాలి. తులసి చెట్టు ఎండిపోతే దానికి వృద్ధాప్యం వచ్చిందని మాత్రమే భావించాలి. ఇలా ఎండిపోయిన చెట్టును జాగ్రత్తగా తీసి పారే నీటిలో వేయాలి.
ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల సకల దేవతలకు పూజలు చేసినట్లేనని కొందరు ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. ఎందుకంటే తులసి చెట్టులో గంగ, యమునా, సరస్వతి దేవతలకు కొలువై ఉంటారని భావిస్తారు. అలాగే తులసి చెట్టులోని మట్టిని కాస్త తీసుకొని దానిని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయడం ద్వారా నది స్నానం చేసినంత పవిత్రతను కలిగి ఉంటుందని అంటారు. తులసి చెట్టు మధ్య భాగంలో కోటి దేవతలు ఉంటారని భావిస్తారు. అందువల్ల తులసి చెట్టుకు ఎప్పుడు పూజ చేయడం వల్ల ఈ దేవతలందరి అనుగ్రహం పొందవచ్చు అని అంటారు.
అయితే ఈ తులసి చెట్టు ఉన్నవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. శుక్రవారం సాయంత్రం సమయంలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో తెంపకుండా ఉండాలి. పీరియడ్స్ ఉన్న మహిళలు ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టును ముట్టుకోవద్దు. ప్రతిరోజు క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీటిని పోస్తూ ఉండాలి. సాయంత్రం సమయంలో తులసి ఆకులను తెంపరాదు. పూజ చేసే తులసి ఆకులను తెంపకుండా ఉండడమే మంచిది.
ఇక తులసి చెట్టును ఎక్కడపడితే అక్కడ కాకుండా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. లేదా ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకున్న శుభ ఫలితాలే కలుగుతాయి.