Rahul Gandhi: “ఆడలేక మద్దెల ఓడు” అని వెనుకటికి ఓ సామెత ఉండేది. ఈకాలంలో ఈ సామెత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉంది. పైగా అతడు ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశాడు. ఎన్నికల సంఘం తీరుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. తనపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పరిస్థితిని పక్కనపెట్టి.. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలపై పడ్డాడు. ఇటీవల హర్యానా రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ కలలు కన్నారు. అనేక సర్వే సంస్థలు రాహుల్ గాంధీ కోరుకున్నట్టుగానే హర్యానా రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి..
సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నివేదికలు ఇవ్వడంతో కచ్చితంగా అధికారంలోకి వస్తామని రాహుల్ గాంధీ నమ్మారు. ఎన్నికల ప్రచారణ కూడా అదే విషయాన్ని పదేపదే చెప్పారు. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితం మరో విధంగా వచ్చింది.. కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా బిజెపి మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఇక అప్పట్నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద పడ్డాడు. మహారాష్ట్ర ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా రావడంతో రాహుల్ గాంధీకి కోపం తారస్థాయికి చేరింది. తన పార్టీ గురించి.. పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాల గురించి పట్టించుకోని రాహుల్ గాంధీ.. తన పార్టీ ఓటమికి కారణం ఎన్నికల సంఘం అని తేల్చి పడేశాడు. ఎన్నికల సంఘం ఎన్డీఏ కూటమి చెప్పినట్టు వింటోందని ఆరోపించాడు.. ఎన్నికల సంఘం తప్పు చేసిందని.. కొన్ని ప్రాంతాలలో ఓట్లు తొలగించిందని.. ఇంకొన్ని ప్రాంతాల్లో అదనపు ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొన్ని ఆధారాలను బయటపెట్టారు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారో.. ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది.. అంతేకాదు దమ్ముంటే అప్పీలు చేయాలని పేర్కొంది. కానీ ఇంతవరకు రాహుల్ గాంధీ ఆ పని చేయలేదు.
తాజాగా బుధవారం కూడా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు ఎన్నికల సంఘం బిజెపి చెప్పు చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. హర్యానా రాష్ట్రంలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని.. అక్కడ 12.5% ఓట్లు నకిలీవని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీంతో ఎలక్షన్ కమిషన్ స్పందించింది. రాహుల్ గాంధీ చేసినవని నిరాధారమైనవని.. ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా ఎటువంటి అప్పిళ్లు దాఖలు కాలేదని స్పష్టం చేసింది. రివిజన్ టైంలో మల్టిపుల్ ఓట్లను నివారించడానికి కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు అభ్యంతరాలు ఎందుకు చెప్పలేదని ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి. మరి దీనిపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.