Rose Flowers: సాధారణంగా చాలా మందికి పూల మొక్కలంటే ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇళ్లల్లో రకరకాల పూల మొక్కలను పెంచుతుంటారు. అందులోనూ ప్రత్యేకంగా గులాబీ పూలు అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఈ గులాబీ మొక్కలను పెంచే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన పూలు ఎక్కువగా పూస్తాయి. ఇందుకోసం ఏం చేయాలి? గులాబీ మొక్కలకు ఎటువంటి ఎరువులు వాడాలనే విషయాలను మనం తెలుసుకుందాం.
గులాబీ మొక్కలకు ఆల్రెడీ పూసి ఉన్న పూలను తీసేయాలి. ఈ విధంగా చేయడం వలన కొమ్మలు పెరుగుతాయి. కొత్త మొగ్గలు వస్తాయి. అంతేకాదు గులాబీ మొక్కను నాటే నేలను బట్టి కూడా వీటి పెరుగుదల ఉంటుంది. అందులో ఎరువుల పాత్ర కూడా చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి.
గులాబీ మొక్కలు బాగా పెరగడంతో పాటు పూలు ఎక్కువగా పూయాలంటే నత్రజని, భాస్వరం మరియు పోటాషియం వంటి మూలకాలు అవసరం. వీటి వలన ఆకులు పెరగడంతో పాటు పువ్వులు బాగా పూస్తాయి. అదేవిధంగా గులాబీ మొక్కలకు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం కూడా అవసరం. ఇందుకోసం సేంద్రీయ ఎరువులు వాడాలి.
అయితే మొక్కలకు తరుచూ నీళ్లు పోయడం వలన నేలలో ఉన్న పీహెచ్ స్థాయి క్షీణిస్తుంటుంది. కాబట్టి కొన్ని నెలల వ్యవధిలో నేల నాణ్యతను తనిఖీ చేయాలి. అలాగే సరైన మోతాదులో ఎరువులను వేయాలి. కంపోస్ట్ ఎరువులు వేసిన తరువాత నీటి పరిమాణాన్ని ఎక్కువ చేయాలి. దాంతోపాటుగా గులాబీ మొక్కలను వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉంచాలి. మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి మట్టితో పాటు వేప పొడిని వేయాలి. దీని వలన పురుగులు పట్టకుండా మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.
ఎప్పటికప్పుడు రాలే పూలను తీసి వేయాలి. అప్పుడే చిగురు వచ్చి కొత్త పూలు వస్తాయి. అదేవిధంగా గులాబీ మొక్కలకు సహజ క్రిమి సంహారకాలు వాడాలి. వేపాకుల్లో వెల్లుల్లి తొక్క వేసి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి మొక్కలపై తరచూ స్ప్రే చేయాలి. ఈ విధంగా చేయడం వలన చీడపీడలు, కీటకాలు, చీమలు మొక్కల దరికి చేరవు.