Lentils cause gas: మన రోజు తీసుకునే ఆహారంలో పప్పు ధాన్యాలు ముఖ్యమైన భాగంగా ఉంటాయి. పప్పుల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతో ఉండడంతో వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా శాకాహారులకు పప్పులు ప్రోటీన్‌కు ప్రధాన వనరు. అయితే పప్పులతో చేసిన ఆహారం తిన్న తర్వాత కొందరికి అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఈ సమస్యల వల్ల కొందరు పప్పులు తినడమే మానేశారు. వాస్తవానికి పప్పులు తిన్నా కూడా గ్యాస్ రాకుండా చేయవచ్చు. అందుకోసం ముందుగా ఇలా చేయాలి..
పప్పులో ఉండే కొన్ని సహజ పదార్థాలైన ఒలిగోసాకరైడ్స్ అనే కార్బోహైడ్రేట్లు పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల అవి కడుపులో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఫైటిక్ యాసిడ్ వంటి పదార్థాలు కూడా జీర్ణక్రియను కొంత కష్టతరం చేస్తాయి. అందుకే పప్పులను నేరుగా వండి తినడం కంటే సరైన విధంగా సిద్ధం చేయడం చాలా ముఖ్యం. అంటే పప్పులను స్టోర్ నుంచి తీసుకువచ్చి నేరుగా వాడుకోవడం కంటే వాటిని నానబెట్టిన తర్వాత ఉపయోగించడం వల్ల గ్యాస్ సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు.పొట్టు తీసిన పప్పులను కనీసం 4 నుంచి 5 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. సాధారణ పప్పులు అయితే 7 నుంచి 8 గంటలు నానబెట్టడం మంచిది. ఈ ప్రక్రియ వల్ల పప్పులోని గ్యాస్‌కు కారణమయ్యే పదార్థాలు కొంతవరకు తొలగిపోతాయి. అలాగే పప్పు మెత్తబడటం వల్ల వండినప్పుడు సులభంగా జీర్ణమవుతుంది.
రాజ్మా, చోలే (సెనగలు) వంటి గట్టిగా ఉండే పప్పులను 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టడం చాలా అవసరం. వీటిని నానబెట్టిన తర్వాత ఆ నీటిని పారబోసి, కొత్త నీటితో వండడం మంచిది. ఈ విధంగా చేస్తే గ్యాస్ సమస్యలు తగ్గడమే కాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పప్పులను నానబెట్టిన తర్వాత మొలకలు రావడానికి ఉంచితే వాటి పోషక విలువ మరింత పెరుగుతుంది. స్ప్రౌట్స్ రూపంలో తీసుకుంటే విటమిన్ C వంటి పోషకాలు కూడా పెరుగుతాయి. అలాగే ఇవి జీర్ణానికి మరింత సులభంగా మారుతాయి.
పప్పులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం అయినప్పటికీ సరైన విధంగా నానబెట్టడం, వండడం వంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అజీర్తి, గ్యాస్ సమస్యలు దూరంగా ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పప్పుల నుంచి పూర్తి స్థాయిలో పోషకాలను పొందవచ్చు.