Agarwood: సాధారణంగా మొక్కలు, చెట్లకు తెగుళ్లు సోకితే ఆ మొక్కలు, చెట్లు ఎందుకూ పనికిరావనే విషయం తెలిసిందే. అయితే అగర్ వుడ్ చెట్టుకు మాత్రం ఫంగస్ సోకితే అద్భుతంగా పరిమళిస్తాయి. బంగారం, వజ్రాలతో పోలిస్తే అగర్ వుడ్ ధర ఎక్కువగా ఉంటుంది. వుడ్ ఆఫ్ ది గాడ్స్ అని పిలిచే అగర్ వుడ్ చెట్టు నుంచి తయారు చేసే తైలం ధర 70 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

కొంతమంది అగర్ వుడ్ ను ద్రవ బంగారం అనే పేరుతో కూడా పిలుస్తారు. అక్వలేరియా జాతి మొక్కలలో ఫంగస్ చేరడం వల్ల చెట్టు దెబ్బ తిని ఆ చెట్టు రక్షించుకోవడం కోసం జిగురును ఉత్పత్తి చేస్తుంది. అరుదైన జిగురు కలప అయిన అగర్ వుడ్ కు ఫంగస్ చేరడం వల్ల సుగంధం వస్తుంది. కాండంలోని భాగం ఎంత నల్లగా ఉంటే అంత నాణ్యతను కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ విధంగా చెట్టు నల్లగా కావడానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది.
అయితే కృతిమ పద్ధతుల ద్వారా ఫంగస్ చేరితే కేవలం ఏడెనిమిది సంవత్సరాల్లోనే అగర్ వుడ్ చేతికి వస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ వుడ్ చెట్లను ఎక్కువగా పెంచుతారు. ఆయుర్వేదంలో ఈ చెట్లలోని భాగాలను ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ఈ చెట్టు చెక్కతో తయారు చేసిన కషాయం తాగితే పొట్ట సమస్యలు తగ్గడంతో పాటు నోరు తాజాగా ఉంటుంది. ఈ చెట్టుతో తయారు చేసిన అత్తర్లను అరబ్ దేశాలలో ఎక్కువగా వినియోగిస్తారు.
సహజంగా సేకరించిన అగర్ వుడ్ ఖరీదు కిలో 75 లక్షల రూపాయలు కాగా ఫంగస్ ను చొప్పించి తయారు చేసిన అగర్ వుడ్ కిలో 2 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. సరైన పద్ధతిలో అగర్ వుడ్ చెట్లను పెంచడం ద్వారా పది సంవత్సరాలలో కోటి రూపాయల వరకు ఆదాయం సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.