Dasari Sai Kumari: ఆకాశంలో సగం.. అన్నింటా సగం.. అంటుంటారు గానీ ఇప్పటికీ మహిళలకు అవకాశాలు ఇవ్వడంలో వివక్ష కనిపిస్తుంది. ఎంత చదువు చదువుకున్నప్పటికీ పెళ్లయిన తర్వాత వారిని వంటింటి కుందేలుగానే ఈ సమాజం పరిగణిస్తున్నది. దీనికి తోడు పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఆరోగ్యం సహకరించకపోవడంతో అఇష్టంగానే మహిళలు వంటింటికి పరిమితమవుతున్నారు. అయితే సూక్ష్మంలో మోక్షం వెతుక్కున్నట్టు ఆ వంటలోనే కొంతమంది మహిళలు రాణిస్తున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. యూట్యూబ్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకున్న పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ దర్జాగా సంపాదిస్తున్నారు. అయితే కొంతమంది మహిళలు మాత్రం తమ చేతివంటను వందలాది మందికి రుచి చూపిస్తున్నారు. అలాంటి కోవలోకి వస్తారు ఈ మహిళ. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ.. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి తన చేతితో వందల మంది కడుపు నింపుతూనే.. తాను కూడా ఆర్థికంగా స్థిరత్వం సంపాదించారు.. అంతేకాదు సోషల్ మీడియా స్టార్ గా కూడా ఎదిగారు..
హైదరాబాదులోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉదయం 11 గంటలు అయింది అంటే చాలు అక్కడ సందడి మొదలవుతుంది. వచ్చేవాళ్లు వస్తూ ఉంటారు. తినేవాళ్లు తింటూ ఉంటారు. పార్సిల్ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు. అంతమందికి ఒక మహిళ వడ్డిస్తూ ఉంటుంది. ఏమాత్రం విసుక్కోదు. టమాటా రైస్, గోబీ రైస్, కర్డ్ రైస్ లెమన్ రైస్, చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, బోటీ, తలకాయ మాంసం.. ఇలా ఎన్నో రకాల వెరైటీలతో వచ్చిన వాళ్లందరి కడుపునిండా పెడుతుంది. ఆ ప్రాంత అన్నపూర్ణగా వెలుగొందుతోంది. ఇంతకీ అదేమైనా పేరొందిన హోటల్ అంటే కానీ కాదు. జస్ట్ ఒక డేరా.. దాని కింద తోపుడు బండి మీద వరుసగా పైన చెప్పినవన్నీ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి మొదలు పెడితే రోజువారి కూలీల వరకు అక్కడ తింటారు. వారి వారి ఆర్థిక స్థోమత ఆధారంగా మెనూ ఎంచుకొని కడుపునిండా తిని వెళ్తారు. ఈ తోపుడు బండి హోటల్ నిర్వహిస్తున్న మహిళ పేరు దాసరి సాయి కుమారి. 13 సంవత్సరాల క్రితం ఆమె దీనిని ప్రారంభించారు. మొదట్లో ఐదు కిలోల అన్నం, ఇతర కూరలతో ప్రారంభించారు. ఈరోజు క్వింటా రైస్ కు చేరుకుంది.. మొదట్లో భార్యాభర్తలు మాత్రమే ఈ పని చేసేవారు. ఇప్పుడు ఏకంగా 15 మందికి ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే.. వంటింటి కుందేలు అని హేళన చేసిన సమాజం నుంచే సాయికుమారి బయటకు వచ్చారు. పొట్ట చేత పట్టుకొని హైదరాబాదుకు వచ్చారు.
ఇతర పని చేద్దామంటే చదువు రాదు. గొప్ప గొప్ప చదువులు చదవలేదు. అందుకే తనకు తెలిసిన పాకశాస్త్రంలోనే ప్రయోగాలు చేశారు.నింపడం కంటే గొప్ప పని వేరే ఉండదని భావించారు. అందుకే తనకు తెలిసిన వంట ద్వారానే నాలుగు రాళ్లు సంపాదించాలి అనుకున్నారు. మొదట్లో ఐదు కిలోల అన్నం వండి దానికి తగ్గట్టుగా కూరలు సిద్ధం చేసుకుని సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయించేవారు. మొదట్లో వ్యాపారం మామూలుగానే ఉండేది. క్రమక్రమంగా ఆమె చేతి వంటకు ఫ్యాన్స్ పెరగడం.. కొంతమంది అక్కడ తింటుండగా వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో ఆమె సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. కేవలం అక్కడివాళ్లు మాత్రమే కాకుండా సినీ రంగంలో పేరుపొందిన రాహుల్ సిప్లిగంజ్.. హీరో నాని.. ఇంకా ఇతర సెలబ్రిటీలు సాయికుమారి వంట రుచి చూసిన వాళ్ళే. అందుకే ఆమె బిజినెస్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం రోజుకు అన్ని ఖర్చులు పోను 30000 దాకా సంపాదిస్తోంది. మునుముందు ఇది మరింత పెరిగిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆడవాళ్ళను వంటింటి కుందేలు అనడం సరికాదు. అందుకు సాయి కుమారి సాధించిన విజయమే ఒక ప్రబల ఉదాహరణ. అన్నట్టు ఈమె విక్రయించే ఆహార పదార్థాల ధరలు బడ్జెట్ లోనే ఉంటాయి. మెనూ ఎక్కువగా కోరుకుంటే మాత్రం దానికి తగ్గట్టుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
View this post on Instagram