DSP Nalini: అది 2012.. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఒకవైపు ఆత్మహత్యలు.. మరోవైపు ఆందోళనలు.. అట్టుడుకుతున్న యూనివర్సిటీలు.. ఇలాంటి తరుణంలో పోలీస్ విధుల్లో ఉన్నారు డీఎస్పీ నళిని. తెలంగాణ కోసం ఉద్యమించే అన్నా చెల్లెళ్లపై లాఠీ ఝళిపించలేక, వారిపైకి తూటాలు ఎక్కుపెట్టలేక.. తన ఉద్యోగాన్నే గడ్డిపోచలా వదిలేసింది నళిని. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు. అయినా జాబ్ వదిలి స్వరాష్ట్రం కోసం ఉద్యమబాట పట్టింది. ఢిల్లీలో దీక్ష చేసింది. అందరి పోరాటం ఫలించి తెలంగాణ కల సాకారమైంది. కానీ స్వరాష్ట్రం కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినిని మాత్రం పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. 1200 మంది అమరులయ్యారని చెప్పిన గత పాలకులు కేవలం 600 మందికే సాయం చేశారు. ఇంకా 600 మంది అడ్రస్ దొరకడం లేదని తెలిపింది. ఇక డీఎస్పీ నళిని చిరునామా ఉన్నా.. ఆమెకు చిరు సాయం చేయడానికి కూడా మనసు రాలేదు గత పాలకులకు. తాజాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో మరోమారు నళిని అంశం తెరపైకి వచ్చింది. నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలన్న డిమాండ్ వస్తోంది. గతంలో ఉద్యమం కోసం చిన్నచిన్న పనులు చేసిన వారు కూడా పెద్ద ఎత్తున బహుమానాలు పొందారు. డబ్బులు సంపాదించారు. ఉద్యమ ద్రోహులు కూడా అందలమెక్కారు. కానీ, నళిని కార్యలయాల చుట్టూ తిరిగి విసిగిపోయింది. చివరకు ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంది.
డీఎస్పీ ఉద్యోగం గడ్డిపోచలా..
డీఎస్పీ స్థాయి ఉద్యోగం సాధించడం అంటే మామూలు విషయం కాదు. నళిని ఎంత టాలెంటో అర్థమైపోతుంది. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె తన అక్కాచెల్లెళ్ల కోసం, స్వరాష్ట్ర సాధన కోసం కష్టపడి సాధించిన కొలువును గడ్డిపోచలా వదిలేసింది. డీఎస్పీ స్థాయి అంటే మామూలు విషయం కాదు ఆమె గురించి అప్పటి తెలంగాణ పార్టీ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇలాంటి వారి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిందని అంతటి స్థాయి వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేస్తే కనీసం పట్టించుకోలేదని ప్రభుత్వం వచ్చాక ఆమె కోసం ఎలాంటి కొలువు ఇప్పించలేదని చాలామంది మొహం మీదే చెప్పేవారు.
ఆధ్యాత్మిక బాటలో..
నళిని ఇప్పుడు ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే ఆమె ప్రస్తుతం పూర్తిగా త్యాగాల నుంచి వేదాల వైపు తన మనసును మలుచుకుంది. ఆర్ష కవిగా కొనసాగుతుంది. పైగా పూర్తిగా ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోయానని నేను ఇప్పుడు పూర్తిగా పోలీసు ఉద్యోగానికి న్యాయం చేయలేనని ఆరోగ్యం పూర్తిగా పోయిందని నళిని అంటోంది. ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా ఎవరో ఒకరు హైకోర్టులో పిల్ వేసి ఆపేస్తారని ఇంకా జీవచ్ఛవంగా చేస్తారని భయంతో అలాంటి పనులు కూడా చేయట్లేదు అని చెబుతోంది నళిని. ఇన్నేళ్ల తర్వాత కూడా తనను అందరూ గుర్తుపెట్టుకున్నందుకు సంతోషంగా ఉన్నా నేను పూర్తిగా వేద మార్గంలో వెళుతున్నానని దైవచింతనలో బతుకుతున్నానని సాత్వికంగా ఉంటున్నానని తెలిపారు. ‘‘ఒకప్పుడు త్యాగం చేశాను ఇప్పుడు వేద యజ్ఞం చేస్తున్నాను’’ అంటూ ఎంతో హృదయ విధానంగా ఆమె చెప్పిన తీరు చూసి పలువురు కంటతడి పెడుతున్నారు.