MLA Sridhar Reddy: పని గళ్ళ మేస్త్రి పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట.. ఈ సామెత తీరుగానే ఉంది అక్కడి అధికారుల వ్యవహార శైలి.. ఏపీలోని సత్యసాయి జిల్లా నల్లమడ మండలం గోపేపల్లి గ్రామంలో ఉపాధి నిధులతో ఇటీవల సిసి రోడ్డు నిర్మించారు. సీసీ రోడ్డు నిర్మాణ సమయంలో నాణ్యత పాటించకపోవడంతో అక్కడి గ్రామస్తులు అప్పట్లోనే ఆందోళన చేశారు.. అధికారుల తీరును నిరసించారు. కాంట్రాక్టర్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. అధికార పార్టీ, అందులోనూ ఆ కాంట్రాక్టర్ కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధికి దగ్గర.. ప్రజలు నిరసిస్తున్నా పట్టించుకోలేదు. పైగా రాత్రికి రాత్రే పనులు చేసుకుంటూ వెళ్లారు. వాటర్ కూడా సరిగ్గా క్యూరింగ్ చేయలేదు. కనీసం వరిగడ్డి కూడా వేయలేదు. ప్రజలు అనుమానించినట్టే చివరికి జరిగింది. పోసి నెలలు కూడా కాకముందే సీసీ రోడ్డు కుంగిపోవడం ప్రారంభించింది. చిన్నపాటి రాయితో రుద్దితే సిమెంటు తేలిపోవడం మొదలైంది.. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ సిమెంట్ కాస్త లేచిపోయింది. కంకర తేలిపోయింది. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లాలని భావించింది. ఇందులో భాగంగానే గడపగడపకు వైసిపి అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఇక అప్పటిదాకా గ్రామస్తులు ఉన్న ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.
ఎమ్మెల్యే తమ గ్రామానికి రాగానే..
శ్రీధర్ రెడ్డి గడపగడపకు వైసిపి కార్యక్రమంలో భాగంగా తమ గ్రామానికి రాగానే అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయనను తీసుకెళ్లి ఇటీవల నిర్మించిన సిసి రోడ్డును చూపించారు. అంతేకాదు అందులో నాణ్యత ఏ విధంగా పాటించారో కళ్ళకు కట్టే విధంగా చూపించారు. ఒకతను రాయితో గీకుతుండగా ఆ సీసీ రోడ్డుపై పోసిన సిమెంట్ మొత్తం పైకి లేవడం మొదలుపెట్టింది. అంతేకాదు గట్టిగా నాలుగు అడుగులు వేస్తే కృంగిపోవడం కనిపించింది. దీంతో ఆ ఎమ్మెల్యేకు అక్కడ పరిస్థితి ఏమిటో అర్థమైంది. ఆ రోడ్డు నాణ్యతను చూసి ఆయనకే చిరాకు అనిపించింది. వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేశాడు. పనులు ఇలా చేస్తే ఎలాగంటే మందలించాడు. అంతేకాదు ఈ సిసి రోడ్డును నాణ్యంగా నిర్మిస్తేనే బిల్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. అంతేకాదు మిగతా పనులను నాణ్యత పాటించాలని స్పష్టం చేశాడు. ఈ సంఘటన వల్ల ఎమ్మెల్యే పరువు పోయినంత పని అయింది.
ఈ ఒక్క గ్రామం మాత్రమే కాదు
సత్య సాయి జిల్లాలో ఈ ఒక్క గ్రామం మాత్రమే కాకుండా జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉపాధి నిధులను రోడ్ల నిర్మాణానికి మళ్ళించి అధికార పార్టీ నాయకులు భారీగా దండుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం కూడా ఆత్రుతగా రోడ్ల నిర్మాణం చేపడుతుందని.. కనీసం నాణ్యతను కూడా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. శ్రీధర్ రెడ్డి రోడ్డును పరిశీలిస్తున్న దృశ్యాలను స్థానికంగా ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రోడ్లు అడ్డగోలుగా నిర్మిస్తే ఎవరికి ఉపయోగమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును దోచుకునేందుకు నాణ్యత లేకుండా రోడ్లు నిర్మిస్తున్నారని దుయ్యబడుతున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియోను టిడిపి నాయకులు తెగ వైరల్ చేస్తున్నారు. రాయితో రుద్దితే లేచిపోయే సిమెంట్ వాడుతున్నారు అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయిలో నాణ్యత పాటిస్తున్నారు అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram