Homeక్రీడలుCSK Vs RCB 2023: గెలిచే మ్యాచ్ లో ఓడడం.. బెంగుళూరుకు మాత్రమే సాధ్యం..!

CSK Vs RCB 2023: గెలిచే మ్యాచ్ లో ఓడడం.. బెంగుళూరుకు మాత్రమే సాధ్యం..!

CSK Vs RCB 2023
CSK Vs RCB 2023

CSK Vs RCB 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత దురదృష్టమైన జట్టు ఏదైనా ఉంది అంటే టక్కుమని చెప్పే పేరు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ప్రతి సీజన్ కు ముందు బలంగా కనిపించే జట్లలో ఆర్సీబీ ముందుంటుంది. కానీ, ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక టోర్నీలో బోల్తా పడుతుంటుంది. ఇక ఆర్సీబీ జట్టుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. గెలిచే మ్యాచ్ లో కూడా ఓడిపోవడం వీరికి తెలిసినంతగా మరో జట్టుకు తెలియదని అభిమానులు విమర్శిస్తుంటారు. తాజాగా సోమవారం చెన్నై తో జరిగిన బిగ్ స్కోరింగ్ మ్యాచ్ లో కూడా బెంగళూరు జట్టు సునాయాసంగా గెలవాల్సిందే. కానీ, ఎప్పటిలానే చివరి దశలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆ జట్టు ఓటమి పాలై.. తనకున్న దురదృష్టాన్ని మరోసారి నిలబెట్టుకుంది.

20 ఓవర్లలో 226 పరుగులు చేసిన చెన్నై..

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టుకు గొప్ప ఆరంభమైతే దక్కలేదు. ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (3) స్వల్ప స్కోర్ కే పెవిలియన్ చేరాడు. అయితే, డెవాన్ కాన్వే 83 పరుగులతో చెలరేగిపోయాడు. కాన్వేకి తోడుగా శివం దూబే కూడా జూలు విదల్చడంతో 52 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 226 పరుగులు స్కోర్ చేసింది. బెంగళూరు జట్టుపై చెన్నై చేసిన అత్యధిక స్కోర్ ఇదే కావడం గమనార్హం.

సులభంగా విజయం సాధించేలా రెచ్చిపోయిన ఆ ఇద్దరు..

భారీ లక్ష్యమే అయినప్పటికీ బెంగళూరు జట్టు గట్టిగానే పోరాటం చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ ఆరు పరుగులకే అవుట్ అయినప్పటికీ, మరో యువ క్రికెటర్ మహిపాల్ లోమ్రార్ (0) కూడా విఫలమైనా.. మరో ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్ అండగా మ్యాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఇద్దరు ఎడాపెడా బౌండరీలు, సిక్సులు బాదడంతో.. బెంగళూరు జట్టు విజయం దిశగా వేగంగానే సాగింది. ఈ క్రమంలోనే మ్యాక్స్వెల్ 76 పరుగులు వద్ద, డూప్లెసిస్ 56 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. దీంతో మ్యాచ్ ఏమవుతుందో అన్న ఉత్కంఠ ఇరు జట్ల అభిమానుల్లోనూ నెలకొంది.

CSK Vs RCB 2023
CSK Vs RCB 2023

మారని ఆర్సీబీ జట్టు అదృష్టం..

ధోని తనదైన కెప్టెన్సీ తో ఈ ఇద్దరి డేంజరస్ ప్లేయర్లను వెంట వెంటనే అవుట్ చేయగలగడంతో చెన్నై జట్టు మళ్లీ పోటీలోకి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో బెంగుళూరు జట్టు ఓటమి పాలు కావాల్సి వచ్చింది. దినేష్ కార్తీక్ 28 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. భారీ షాట్ కు యత్నించిన కార్తీక్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అవుట్ కావడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపించలేకపోవడంతో ఎనిమిది పరుగులు తేడాతో బెంగుళూరు జట్టు ఓటమి పాలైంది. గెలిచే మ్యాచ్లో ఓడడం కేవలం ఆర్సీబీకే సాధ్యం అంటూ అభిమానులు మీమ్స్ పేలుస్తున్నారు. ఆర్సీబీ జట్టు ‘లక్కే’ అంత అంటూ మరి కొంతమంది అభిమానులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్సీబీ జట్టు లక్కు ఎప్పుడు మారుతుందో అర్థం కావడం లేదంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కప్పు కొట్టలేని జట్టుగా నిలిచిపోయిన ఆర్సీబీ.. మరో చెత్త రికార్డును నమోదు చేసుకుంది. విజయానికి దగ్గరలో బోల్తాపడడం ఈ జట్టుకు అలవాటుగా మార్చుకుందని, ఈ రికార్డు మరే జట్టుకూ లేనంతగా బెంగళూరు జట్టు పదిలం చేసుకుంటోందని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version