Credit Card: ప్రస్తుతానికి చాలామందికి ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆర్థిక అవసరాలకు, వస్తువుల కొనుగోలుకు క్రెడిట్ కార్డు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే క్రెడిట్ కార్డు ఉంది కదా అని చాలామంది ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారు. క్రెడిట్ కార్డుతో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు సంతోషపడి.. బిల్లులు చెల్లించేటప్పుడు బాధపడుతున్నారు. ఆ తర్వాత సరైన క్రమంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే సరైన ప్రణాళిక ద్వారా క్రెడిట్ కార్డును ఉపయోగించాలి. ఇలా ఉపయోగించడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండకపోవడంతో పాటు సిబిల్ స్కోర్ తగ్గకుండా ఉంటుంది. అందుకోసం ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలి అంటే?
క్రెడిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ దీని ద్వారానే వస్తువులు కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే సాధ్యమైనంతవరకు క్రెడిట్ కార్డు ద్వారా 30% వరకు మాత్రమే వస్తువుల కొనుగోలుకు ఏర్పాటు చేసుకోండి. ఉదాహరణకు క్రెడిట్ కార్డు లిమిట్ లక్ష రూపాయలు ఉంటే ఇందులో 30 వేల వరకు మాత్రమే ఖర్చు చేయాలని నిర్ణయించుకోండి. ఇలా 30 శాతం వరకు మాత్రమే ఖర్చు చేస్తే బ్యాంకు అధికారుల దృష్టిలో ఖాతాదారుడి లిమిట్ ఖర్చుల విషయం పడుతుంది. దీంతో వీరి సిబిల్ స్కోర్ ఎప్పటికప్పుడు గుడ్ పొజిషన్లో ఉంటుంది.
కొంతమంది క్రెడిట్ బిల్లు రాగానే దాని గడువు తేదీ వరకు వెయిట్ చేస్తారు. ఆ సమయంలో అందుబాటులో డబ్బు లేకపోవడంతో ఆత్రుతగా ఉంటారు. ఒక్కోసారి పలు కారణాల వల్ల సమయానికి డబ్బు దొరకకపోవచ్చు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో బిల్లు ఉంటే ఆ మొత్తంలో డబ్బు లేకపోవచ్చు. అందువల్ల క్రెడిట్ కార్డు బిల్లు రాగానే చేతిలో నగదు ఉంటే చిన్న మొత్తంలో చెల్లింపులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా చేయడం ద్వారా గడువు తేదీ వచ్చేసరికి బిల్లు మొత్తం తక్కువగా కనిపిస్తుంది. దీంతో భారం పడకుండా ఉంటుంది. ఫలితంగా క్రెడిట్ కార్డు పై తక్కువ మొత్తంలోనే బిల్లు ఉన్నట్లు నమోదు అవుతుంది.
క్రెడిట్ కార్డు వినియోగంలో క్రమశిక్షణ ఉండాలి. అంటే ఒకే కార్డు పై ఎక్కువ మొత్తంలో కాకుండా.. రెండు లేదా మూడు కార్డులను ఉపయోగించి ఖర్చులు చేస్తుండాలి. దీంతో మొత్తంగా ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. మూడు కార్డులు మీద ఖర్చు చేస్తే ప్రతీ కార్డుపై 30% వరకు మాత్రమే ఖర్చు చేసినట్లు నమోదు అవుతుంది. ఫలితంగా సిబిల్ స్కోర్ తగ్గకుండా ఉంటుంది.
కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వారి లిమిట్ తక్కువగానే ఉంటుంది. అయితే వినియోగదారుడి ఆర్థిక వ్యవహారాలను చూసి ఈ లిమిట్ పెంచే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు లిమిట్ సాధ్యమైనంతవరకు పెంచితేనే లాభం. ఎందుకంటే ఎక్కువ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు పై మనం చేసే ఖర్చులు తక్కువగా నమోదు అవుతాయి. దీంతో 30% ఖర్చులు నమోదు కావడంతో సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువగా వాడే క్రెడిట్ కార్డుల లిమిట్ పెంచుకోవడం మంచిది.