COVID Impact on Human Life: ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.. ఇదీ ఓ సెల్యులార్ కంపెనీ ట్యాగ్‌లైన్.. ఈ క్యాప్షన్ తరహాలోనే.. ఒక్క వైరస్.. ప్రపంచంలో మానవ జీవితాన్ని మార్చేసింది. మూడేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ మహమ్మారి.. విద్య, వైద్యం, ఆర్థిక వ్యవస్థను వెనక్కు నెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యానికి కారణమైంది. అదే కోవిడ్. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మనుషుల్లోని విచ్చలవిడితనానికి బ్రేక్ వేసింది. మనం ఏం తింటున్నాం.. ఏం తినాలో తెలియజేసింది. సంస్కృతి, సంప్రాయాలు, పాటించాల్సిన నియమాలను గుర్టుచేసింది. ఇవన్నీ మనకు తెలియనివి కావు. కానీ భయం, భక్తి లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగింది. కోవిడ్ రాకతో మళ్లీ అందరూ క్రమశిక్షణ లైఫ్‌స్టైల్‌పై దృష్టిపెట్టారు. ఇక జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జీవన విధానాలను మార్చివేసింది. ప్రజల ఆలోచనా విధానంలో, జీవన శైలిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా, ప్రయాణ అలవాట్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రకృతి ఒడిలో విశ్రాంతి, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శనలు పెరిగాయి.
ప్రకృతి, ఆధ్యాత్మికత వైపు ప్రయాణం
కొవిడ్ సంక్షోభం తర్వాత ప్రజలు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ప్రకృతి పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలవైపు ఆకర్షితులవుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ వంటి ప్రదేశాలు పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. అదే విధంగా, తిరుపతి, వారణాసి, రామేశ్వరం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ధోరణి వెనుక మానసిక శాంతి, స్వీయ ఆవిష్కరణ కోసం ప్రజల ఆసక్తి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చార్జీలు భారం..
కొవిడ్ తర్వాత విమాన రంగం గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంది. ఇంధన ధరల పెరుగుదల, ఆపరేషనల్ ఖర్చులు విమాన టికెట్ల ధరలను ఆకాశానికి చేర్చాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి సాధారణ రౌండ్–ట్రిప్ టికెట్ ధర సుమారు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటోంది. ఇది పండగ సీజన్లో మరింత పెరుగుతోంది. ఈ ధరలు సామాన్య ప్రయాణికులకు భారంగా మారడంతో చాలామంది రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు.
రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ సమస్య..
ఇక రైలు ప్రయాణం ఆర్థికంగా సరసమైన ఎంపిక అయినప్పటికీ, రైళ్లలో టికెట్ల లభ్యత పెద్ద సమస్యగా మారింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి తెలుగు రాష్ట్రాల ప్రధాన మార్గాల్లో రైళ్లు ఎప్పుడూ నిండుగా ఉంటున్నాయి. సగటున 400–500 సీట్ల వెయిటింగ్ లిస్ట్ సాధారణంగా కనిపిస్తోంది. పండగలు, వేసవి సెలవుల సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ పరిస్థితి చాలామందిని బుకింగ్‌కు దూరంగా ఉంచుతోంది, ఫలితంగా కొందరు ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నారు.
Also Read: భూమిపై అత్యంత పెద్ద చెట్లు ఇవే..!
ప్రధాన నగరాల్లో రద్దీ, సమస్యలు
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల నుంచి దిల్లీ, తిరుపతి వంటి గమ్యస్థానాలకు రైళ్ల డిమాండ్ భారీగా ఉంది. అయితే, రైళ్ల సంఖ్య, సామర్థ్యం ఈ డిమాండ్‌ను తీర్చలేకపోతున్నాయి. రైల్వే శాఖ తాత్కాలికంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నప్పటికీ, ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోతోంది.