
Corona Vaccine- Heart: ధూమపానం, మద్యపానం, అధిక బరువు, రక్తపోటు, వంశపారంపర్య లక్షణాలు ఉన్నవారికే గుండెపోట్లు వచ్చేవి. కానీ ఇప్పుడు పై వేవీ లేకున్నా గుండె పోటు వస్తోంది. క్షణాల్లో ప్రాణాలను కబళించేస్తోంది. అప్పటి దాకా మనతో కలివిడగా ఉన్న మనిషి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించడాన్ని జీర్ణించుకోవడం కష్టమవుతోంది. మొన్న నిర్మల్ ప్రాంతానికి ఓ యువకుడు వచ్చాడు. బంధువుల పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ వేస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బంధువులు ఆసుపత్రికి తరలించే లోగా కన్ను మూశాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. పునీత్ రాజ్‌కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి, తారకరత్న.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా పెద్దదే.
కోవిడ్ వ్యాక్సిన్ వల్లేనా?
కోవిడ్ మొదటి, రెండు దశల్లో చాలా మంది గుండెపోటుతోనే కన్నుమూశారు. అప్పట్లో కోవిడ్ బారిన పడిన చాలా మందిని కాపాడేందుకు వైద్యులు రెమిడెసివీర్ ఇంజక్షన్లు వేశారు.దీని వల్ల తర్వాత కొందరిలో బ్లాక్ ఫంగస్ వంటి లక్షణాలు కన్పించాయి. కొందరు కన్నుమూశారు కూడా. అయితే మన దేశంలో కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు గుండె పోటు రూపంలో సరికొత్త సమస్య ఎదురవుతోంది. చూసేందుకు బక్క పలచగా ఉన్న వ్యక్తులు గుండె పోటుకు గురయి అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. అయితే కోవిడ్ రెండో దశలో ప్రభుత్వం వ్యాక్సిన్లు వేసింది. దీని వల్ల చాలా మంది విభిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటు న్నారు. అలసట, ఊరికే చెమటలు పట్టడం, వాతావరణంలో చిన్నపాటి మార్పులు ఏర్పడినా అనారోగ్యానికి గురికావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అప్పట్లో ప్రచారం జరిగితే ప్రభుత్వం కొట్టి పారేసింది. కానీ ఇప్పుడు కొందరు వైద్యులు మాత్రం ప్రస్తుత పరిస్థితులకు కోవిడ్ వ్యాక్సినే కారణమని చెబుతున్నారు.
శ్రద్ధేదీ?
కాలానుగుణంగా మనిషి జీవనశైలిలో మార్పులు వచ్చాయి. నెట్ విప్లవమే ఇందుకు కారణం. రాత్రి రెండు గంటల దాకా మేల్కొని ఉండటం, ఉదయం పది దాకా పడుకోవడం, జంక్ ఫుడ్, మద్యం, దూమపానం చేయడం వల్ల శరీరంలో జీవక్రియలు అదుపు తప్పుతున్నాయి. వ్యాయామం చేయకపోవడం, సూర్య కిరణాలు శరీరానికి తాకకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా రాత్రి పొద్దు పోయిన తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల శరీరం అదుపు తప్పుతోంది. అకస్మాత్తుగా గుండె పోటు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ తీవ్ర మైన గుండె పోటు రావడం పట్ల వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఉద్రిక్తలకు లోను కావొద్దని సూచిస్తున్నారు. ఉద్రిక్తతలే ఒత్తిడిని పెంచుతున్నాయని, ఇది అంతిమంగా గుండె మీద ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. అది తీవ్రమైన గుండెపోటుకు దారి తీస్తోందని, అందువల్లే మనిషి కుప్ప కూలిపోతున్నాడని వివరిస్తున్నారు.

ఇవి చేస్తేనే
పూర్వం కట్టెల పోయి మీద వంట వండేవారు. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. అప్పట్లో ఉదయాన్నే లేవడంతో సూర్య కిరణాలు శరీరం మీద పడటం వల్ల డీ విటమిన్ అందేది. శరీరంలో ఎదుగుదల ఉండేది. ఇప్పుడు కాలచక్రానికి వ్యతిరేకంగా పని చేయడం, వేళాపాళా లేని ఆహారపు అలవాట్ల వల్ల శరీరం పూర్తిగా మారిపోతోంది. అందుకే ఉదయం తొందర లేవాలి. రాత్రి తొందర పడుకోవాలి. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి. ఒక్కసారి వాడిన నూనె మళ్లీ వాడకూడదు. రాత్రి పూట అన్నానికి బదులు గోఽధుమ, జొన్న రొట్టెలు తీసుకోవాలి. మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. చెమట వచ్చేలా పని చేయాలి. నడక లేదా పరుగు లాంటివి చేయాలి. అప్పుడే శరీరంలో జీవక్రియల రేటు బాగుంటుంది.