Chicken Color Health Warning: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే మాంసాహారాల్లో చికెన్ ఒకటి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే చికెన్ ఎంత పోషకమైనదైనా.. అది తాజాగా లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వండే ముందు చికెన్ నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చికెన్ కలర్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. తాజాగా ఉండే చికెన్ ఏ కలర్ లో ఉంటుందంటే?
తాజాగా ఉండే చికెన్ సాధారణంగా లేత గులాబీ రంగులో కనిపిస్తుంది. దాని మాంసం మృదువుగా, తేమతో ఉన్నప్పటికీ అతిగా జిగటగా ఉండదు. ముఖ్యంగా తాజా చికెన్‌కు ఎలాంటి దుర్వాసన ఉండదు. సహజమైన మాంసం వాసన మాత్రమే ఉంటుంది. మార్కెట్‌లో చికెన్ కొనుగోలు చేసే సమయంలో వీటిని గుర్తించి కొనుగోలు చేయడం మంచిది. చికెన్ తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి మరో సులభమైన పరీక్ష కూడా ఉంది. వేళ్లతో మాంసాన్ని స్వల్పంగా నొక్కితే అది వెంటనే మళ్లీ తన అసలు ఆకారంలోకి వస్తే చికెన్ తాజాగా ఉన్నట్లు భావించవచ్చు. ఇది మాంసం నాణ్యత బాగుందని సూచించే ప్రధాన సంకేతాల్లో ఒకటి.
అయితే చెడిపోయిన చికెన్‌లో కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మాంసం రంగు బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగులోకి మారవచ్చు. అలాగే పుల్లటి లేదా అసహ్యకరమైన దుర్వాసన వస్తుంది. చేతితో తాకినప్పుడు మాంసం జిగటగా, అతుక్కుపోయినట్లుగా అనిపిస్తుంది. నొక్కినప్పుడు గుంత పడిపోయి తిరిగి సాధారణ స్థితికి రాకపోతే అది పాడై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇలాంటి చికెన్‌ను వండి తింటే ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందువల్ల అనుమానం వచ్చిన చికెన్‌ను ఉపయోగించకుండా పారేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
నిపుణుల సూచనల ప్రకారం చికెన్‌ను విశ్వసనీయ దుకాణాల నుంచే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత త్వరగా వండాలి లేదా ఫ్రిజ్‌లో సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. వండేటప్పుడు చికెన్ పూర్తిగా ఉడికేలా చూసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే కుటుంబాన్ని ఆహార సంబంధిత అనారోగ్యాల నుంచి రక్షించుకోవచ్చు.
