Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం లో మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. పూర్వం నుంచి ఇప్పటివరకు చాణక్యుడు రచించిన చాణక్యనీతిని ఫాలో అవుతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాణక్యుడు నీతి నియమాలను పాటించే వారు కచ్చితంగా జీవితాన్ని సంతోషకరంగా పాటిస్తారు.
చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులతో కలిసి జీవించడం చాలా కష్టమనే చెప్పుకోవచ్చు. ఈ తరహా వ్యక్తులకు, ప్రదేశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి మనుషులకు మనం దూరంగా ఉండాలనే విషయాలను తెలుసుకుందాం.
గౌరవం లేని చోట ఉండకూడదని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఎందుకంటే సరైన గౌరవం లభించినప్పుడే పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. చుట్టు పక్కల ఉండే వ్యక్తులు మనపై చెడు అభిప్రాయాలను కలిగి ఉంటే లేదా వ్యక్తిత్వాన్ని పాడు చేసే వ్యక్తులతో ఉంటే ఎప్పటికీ మనం విజయాన్ని సాధించలేమని ఆయన వెల్లడించారు. చిన్నవారైనా, పెద్దవారైనా అందరినీ తప్పక గౌరవించాలని చాణక్యుడు తెలిపారు.
అలాగే జీవనోపాధి లేని ప్రదేశంలో కూడా ఉండొద్దని చాణక్యుడు వివరించారు. ఉద్యోగం రాకపోయినా వ్యాపారం చేయడానికి అనుకూల వాతావరణం లేకపోయినా ఆ ప్రదేశాన్ని వెంటనే వదిలేయాలని చాణక్యుడు సూచించారు. అదేవిధంగా జాలి, దయ, దానం చేసే గుణాలు లేని వ్యక్తుల మధ్య కూడా జీవించవద్దని చాణక్యుడు సూచించారు.
మనం నివసించే ప్రదేశంలో అందరూ ఒకరినొకరు ఆదుకోవాలి. ప్రధానంగా ఆపద సమయాల్లో మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి. ధన సాయం చేయకపోయినా కనీసం మాటలతో అయినా ధైర్యం చెప్పాలి. ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకోకుండా ఉండే వారి మధ్య కూడా ఉండకూడదని చాణక్యుడు వివరించారు. మద్యం, సిగరెట్లు వంటి చెడు అలవాట్లు ఉన్న వారు తప్పుడు మార్గాల్లో నడిచే అవకాశం ఉంది. అలాంటి వారు కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడతారు.. అందుకే ప్రతి ఒక్కరూ తమ స్నేహితులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.