Chanakya Niti for business success: కొంతమందికి ఉద్యోగం కంటే వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టం. అయితే ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి? వ్యాపార లక్షణాలు ఎలా ఉండాలి? అనే విషయాలు ముందుగా అవగాహన తెచ్చుకోవడం చాలా అవసరం. వ్యాపారం అంటే దాదాపు ఒక కుటుంబాన్ని పోషించినంత భారం మోయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో పకడ్బందీగా ఉంటేనే వ్యాపారం సక్సెస్ అవుతుంది. అయితే అపర చాణక్యుడు కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి కొన్ని విలువైన సూత్రాలను అందించాడు. ఈ సూత్రాలను ఫాలో అయితే కచ్చితంగా వ్యాపారంలో సక్సెస్ అవుతారు అని తెలిపాడు. మరి ఆ సూత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
ముందు చూపు:
ప్రతి వ్యాపారస్తునికి ముందు చూపు తప్పనిసరిగా ఉండాలి. భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేసి అందుకు అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. లేదా వినియోగదారులకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో.. ముందే గుర్తించి అందుకు అనుగుణమైన వస్తువులను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం వ్యాపారం లాభాల్లో ఉంటే.. భవిష్యత్తులో నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ నష్టం నుంచి తట్టుకునే శక్తిని ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ప్రతి విషయంలో వ్యాపారుడికి ముందు చూపు ఉండాలని చాణక్యుడు చెప్పాడు.
లీడర్:
వ్యాపారం అంటే ఒక కుటుంబాన్ని పోషించినంత భారం ఏర్పడుతుంది. వ్యాపారస్తుడు ప్రతి విషయంలో బాధ్యతగా ఉంటూ.. నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి. వ్యాపారం చేసే వారికి నైతికత కచ్చితంగా అవసరం. తనకింద పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి. వారిలో ఒకరిగా పనిచేస్తూ కలిసిమెలిసి ఉండేలా ప్రయత్నించాలి. అప్పుడే ఉద్యోగులు సైతం వ్యాపారం విజయవంతం కావడానికి తగిన తోడ్పాటును అందిస్తారు.
ఆర్థిక నిర్వహణ:
ఈ వ్యాపారం ప్రారంభించినా.. డబ్బు కచ్చితంగా అవసరం ఉంటుంది. అయితే ఈ డబ్బు నిర్వహణలో మెలకువలు తెలిసి ఉండాలి. నష్టం వచ్చినప్పుడు భయపడకుండా తనకింద పనిచేసే ఉద్యోగులను కాపాడుకుంటూ మెయింటైన్ చేయాలి. అలాగే ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆర్థిక పరిస్థితి డీలాపడే పరిస్థితికి రాకుండా ముందే ప్లాన్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో నగదు ఉండేలా ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్రీ ప్లాన్ తో ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.
కమ్యూనికేషన్:
ప్రతి వ్యాపారుడికి ఇది తప్పనిసరి. ఎదుటివారితో మంచిగా మాట్లాడుతూ.. వారి అవసరాలను గుర్తించి.. వారికి అనుగుణంగా వస్తువులను అందుబాటులో ఉంచితే ప్రతి వ్యాపారుడు కచ్చితంగా విజయం సాధిస్తాడు. అలాగే తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల బాధలను కూడా అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారిని సమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. ఇలా తన చుట్టూ ఉన్న వాతావరణం స్వచ్ఛంగా ఉండడానికి వ్యాపారుడు ప్రయత్నిస్తే.. తాను చేసే వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి.
వ్యూహం:
సమాజంలో పరిస్థితులు ఎప్పటికీ ఒకలా ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాన్ని మార్చుకుంటూ ఉండాలి. సందర్భాన్ని బట్టి సాంప్రదాయ వ్యాపారం చేస్తూ.. నేటి వారికి అనుగుణంగా వస్తువులను మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే వ్యాపారం పై నమ్మకం ఏర్పడుతుంది.