Chanakya Niti: ఏ జంతువులో లేని స్వార్థం ఒక్క మనిషిలోనే ఉంటుంది. మనిషి స్వార్థంతో తన పని చేసుకుని తరువాత పట్టించుకోడు. దీంతో జీవితంలో చాలా కోల్పోతాడు. కానీ ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నాట్ట. మనిషిలో స్వార్థం, సంకుచిత తత్వాలే మనిషి మనుగడను దెబ్బతీస్తాయి. కానీ ఇవేమీ పట్టించుకోరు. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా స్వార్థంతోనే అనే విషయం గ్రహించుకోరు. ఫలితంగా అవసరం ఉన్నప్పుడే మనిషిని ఆశ్రయించడం తరువాత దూరం కొట్టడం చేస్తుంటారు.

స్వార్థం మనిషిని ఎందాకైనా దిగజారుస్తుంది. జీవితంలో ముందుకు సాగాలంటే మనిషికి స్వార్థం ఉండకూడదు. మనిషిలో స్వార్థం పెరిగిపోతోంది. ప్రతి వారు తమ పని చేసుకోవడానికి ఇతరులపై ఆధారపడతాడు. అవసరం తీరగానే అతడిని దూరం కొట్టడం మామూలే. మనిషిలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. స్వార్థంతోనే మనిషి దుఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అయినా వారిలో మార్పు కానరావడం లేదు. ఇతరులకు హాని కలిగించే వ్యక్తులు తరచుగా కనిపిస్తుంటారు.
జీవితంలో నిజమైన స్నేహితులు తక్కువ మందే ఉంటారు. నిస్వార్థంగా స్నేహం చేసే వారు కూడా ఈ రోజుల్లో అరుదే. ఏ స్వార్థం లేకుండా మనతో స్నేహం చేసే వాడు మనకు ఆపదలు కలిగినప్పుడు తోడుండే వాడే నిజమైన స్నేహితుడు. ప్రతి వారిలో ఎంతో కొంత స్వార్థం దాగి ఉంటోంది. ఫలితంగా వారు తమ పని చేసుకునేందుకే స్నేహం పేరుతో దగ్గర కావడం చేస్తుంటారు. పని అయిందంటే చాలు ఇక ముఖం చాటేయడం పరిపాటే. లోకంలో ఇలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న వారే ఎక్కువగా కనిపిస్తుంటారు.

పండ్లు ఉన్న చెట్టు మీదే పక్షులు వాలినట్లు. డబ్బులు ఉన్న వాడి దగ్గరే స్నేహితులనే వారు చుట్టు ముడతారు. అతడి దగ్గర డబ్బులు అయిపోగానే వారు ఇంకొకరిని వెతుక్కుంటారు. ప్రతి వారి స్నేహం మాటున స్వార్థమనే విషం దాగి ఉంటుంది. స్వార్థం లేకుండా ప్రజలు దేవుడినే కొలవడం లేదు. భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలని కాకా పడుతుంటారు. కానీ నిజమైన భక్తితో ఎవరు కూడా దేవుళ్లను కొలవడం లేదు. స్వార్థమనే ఉద్దేశం మీదనే ప్రపంచం నడుస్తోంది.