Homeఅంతర్జాతీయంChina Imperialism: చైనా సామ్రాజ్యవాదం: హిమాలయాలపై పడగ విప్పుతోంది

China Imperialism: చైనా సామ్రాజ్యవాదం: హిమాలయాలపై పడగ విప్పుతోంది

China Imperialism: మహమ్మద్‌ అలీ జిన్నా ప్రవచించిన ద్విజాతి సిద్ధాంతం 1947లో భారతదేశ విభజనకు కారణమైంది. వేల ఏళ్లుగా అవిభక్త భారత దేశంలో నివసించే హిందూ, ముస్లింలు అంతా భారత జాతీయులే అన్న వాస్తవాన్ని ఆనాటి మన జాతీయ నాయకులు సమర్థంగా వినిపించలేకపోయారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్‌ పార్టీ హింసాత్మక చర్యలతో అల్లకల్లోలం చెలరేగడం… ‘విభజించు – పాలించు’ అనే బ్రిటీష్‌ పన్నాగంతో మెజార్టీ ప్రజల అభిమతానికి విరుద్ధంగా దేశాన్ని విభజించారు. ఆ గాయాలు ఇప్పటికీ బాధిస్తునే ఉన్నాయి…కాగా చైనా నేత మావో జెడాంగ్‌ ప్రవచించిన ‘ఏక జాతి’ సిద్ధాంతం కూడా అంతే ప్రమాదకరమైంది. హిమాలయ దేశాలు టిబెట్‌. నేపాల్, భుటాన్‌లతోపాటు భారత్‌లోని లద్దాఖ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లు చైనాలో అంతర్భాగమనే అసంబద్ధ వాదనను మావో 1939–40లలోనే లేవనెత్తారు. ఆ డ్రాగన్‌ దేశం గతంలో టిబెట్‌ను ఆక్రమించినా…మన అరుణాచల్‌ ప్రదేశ్‌పై తరచూ పేచీలు పెడుతున్నా…ప్రస్తుతం లద్ధాఖ్‌లోకి చొచ్చుకొచ్చేందుకు దుస్సాహసానికి పాల్పడుతున్నా.. అన్నింటి వెనుకా ఉన్నది ఆ సిద్ధాంతమే.

China Imperialism
China Imperialism

ఐదు వేళ్ల సిద్ధాంతం

హిమాలయ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకుని దక్షిణాసియాపై ఆధిపత్యం సాధించడానికి మావో లేవనెత్తిందే ‘అరచేయి… ఐదు వేళ్ల’ సిద్ధాంతం. టిబెట్‌ దేశం చైనా అర చేయి అయితే నేపాల్, లద్దాఖ్, సిక్కిం, భూటాన్, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఆ చేతి ఐదు వేళ్లు అన్నదే ఆ వాదన. ఆ ప్రాంతాల్లోని గిరిజన తెగలన్నీ చైనాలోని హన్‌ జాతికి ఉప జాతులేనని … ఆ ప్రాంతాలన్నీ చైనాకు ఉప ప్రాంతాలేననని మావో వితండవాదం. ఆ ప్రాంతాలను చైనాలో కలుపుకోవడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ విషయాన్ని చైనా పాఠ్యపుస్తకాల సిలబస్‌లో కూడా చేర్చడం మావో దుర్బుధ్దిని తెలియజేస్తోంది. మావో చెప్పిన ఏకజాతి సిద్ధాంతాన్ని టిబెటన్లతోపాటు నేపాల్, భూటాన్‌లతోపాటు భారత్‌లోని సిక్కిం, లద్ధాఖ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనాలోని హన్‌ జాతీయులకు హిమాలయ పర్వత తెగలకు జన్యుపరంగా, భాషా–సాంస్కృతికంగా, భౌగోళికంగా వ్యత్యాసాలు ఉన్నాయని…వారంతా ఒకే జాతి కాదని శాస్త్రీయ పరిశోధనలూ స్పష్టం చేస్తున్నాయి. టిబెటన్లు, నేపాలీలు, భుటానియన్లు, సిక్కీమీలు, లద్దాఖీలు, అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు పర్వత ప్రాంతాల ప్రజలు. వారు ఆక్సిజన్‌ తక్కువుగా ఉండే అత్యంత ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లోనూ జీవించగలరు. జన్యుపరంగా వారి శరీర నిర్మాణం అందుకు అనుకూలంగా ఉంది. అందుకే పర్వతారోహణలో వారు విశేషంగా రాణిస్తున్నారు. కానీ చైనాలోని మైదాన ప్రాంత హన్‌ జాతీయులు ఆక్సిజన్‌ తక్కువుగా ఉండే ఎత్తైన ప్రాంతాల్లో జీవించలేరు. ఇక టిబెటన్లు తమ మాతృదేశం టిబెట్‌ తరువాత భారత్‌నే ∙
ఇష్టపడతారు. చైనా దురాక్రమణతో తమ దేశం వదలిన టిబెటన్ల గురువు దలైలామాకు భారత్‌ ఆశ్రయం ఇచ్చింది. అందుకు ఆగ్రహించే చైనా భారత్‌తో 1962లో యుద్ధానికి పాల్పడింది. ఇప్పటికీ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల కేంద్రంగానే టిబెటన్లు తమ ప్రవాస ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. తమ దేశ స్వాతంత్య్రం కోసం అంతర్జాతీయ సమాజం సహకారం కోరుతూ దౌత్యపరమైన పోరాటం చేస్తున్నారు. భూటాన్‌ కూడా భారత్‌ను ఆది నుంచీ సహజ మిత్ర దేశంగా ఉంది. తలసరి ఆనందంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్న భూటాన్‌ చైనా ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదు.

చైనా ఉచ్చులో నేపాల్‌ పాలకులు

చారిత్రకంగా, సాంస్కృతికంగా భారత్‌ తమకు సహజమిత్ర దేశమనే వాస్తవాన్ని నేపాల్‌ పాలకులు ఇటీవల విస్మరిస్తున్నారు. నేపాల్‌నూ కబళించాలన్నది చైనా దుర్నీతి. ముందుగా నేపాల్, భారత్‌ల మైత్రిని విచ్ఛిన్నం చేయాలన్నది ఆ దేశ పన్నాగం. చైనా భారీగా అప్పులు ఇస్తూ బిగించిన ఆర్థిక దిగ్బంధనంలో నేపాల్‌ చిక్కుకుంది. చైనా ఒత్తిడితో భారత్‌తో తాజాగా సరిహద్దు వివాదాలు సృష్టిస్తోంది. నేపాల్‌లో మావోయిస్టు పార్టీ ప్రాబల్యం కూడా అందుకు కారణం. అక్కడి ప్రజలు మాత్రం భారత్‌కు అనుకూలంగానే ఉన్నారన్నది వాస్తవం. ప్రస్తుతానికి కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నేపాల్‌తో ఏర్పడ్డ విభేదాలు సమసిపోయే అవకాశాలున్నాయి.

భారత్‌లో వికసిస్తున్న హిమాలయ రాష్ట్రాలు

భారత్‌లోని హిమాలయ ప్రాంతాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. ప్రజాస్వామిక వ్యవస్థ, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, హిమాలయప్రాంత ప్రజల ప్రత్యేక హక్కుల పరిరక్షణ వంటి భారత విధానాలు స్థానికుల్లో విశ్వాసాన్ని పెంచాయి. లద్దాఖ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని షెర్పాలు, నేపాలీలు, భూటియాలు, ఛెత్రిలు, జెంగ్‌డోపాలు, తవాంగన్లు, మోన్పాలు…వంటి ఎన్నో తెగలు తమ సంస్కృతిని కాపాడుకుంటూనే విశాల భారతావనిలో వికాసపథంలో సాగుతున్నాయి. షెర్పాలు ప్రధానంగా నేపాల్, టిబెట్‌లతోపాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఉన్నారు. నేపాల్‌కు చెందిన టెన్సింగ్‌నార్కే న్యూజిలాండ్‌కు చెందిన ఎడ్మండ్‌ హిల్లరీతో కలసి ప్రపంచంలో మొదటిసారిగా 1953లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. ఆ తరువాత ఆయన భారత దేశంలో స్ధిర నివాసం ఏర్పరచుకున్నారు. భారత ప్రభుత్వం టెన్సింగ్‌ నార్కేకు 1959లో పద్మ భూషణ్‌ పురష్కారాన్ని ప్రదానం చేసింది. ఆయన తన శేష జీవితాన్ని భారత్‌లోనే గడిపి 1984లో డార్జిలింగ్‌లో చనిపోయారు. టెన్సింగ్‌ నార్కే సమాధి అక్కడే ఉంది. హిమాలయాల్లో పర్వతారోహకులకు షెర్పాలే గైడ్‌లుగా వ్యవహరిస్తారు. ఇక నేపాల్‌ మూలాలు ఉన్న గోర్ఖాలు ప్రధానంగా
ఈశాన్య భారతంతోపాటు దేశమంతటా నివసిస్తున్నారు. భారత సైన్యంలో గోర్ఖా రెజిమెంట్‌ అత్యంత కీలకమైంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ కేంద్రంగాప్రత్యేక గోర్ఖా ల్యాండ్ రాష్ట్రం కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వారికి కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తితో గోర్ఖాల్యాండ్ కౌన్సిల్‌ ఏర్పాటు చేసింది. నేపాలీ భాషను అధికారికంగా గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చింది.

చైనా అంటేనే మండిపడుతున్నారు

షెర్పాలు, ఛెత్రిలు, భూటియాలు వంటి ఎన్నో తెగల కలయిక అయిన సిక్కీమీలు చైనా అంటేనే మండిపడుతుంటారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 1947నాటికి సిక్కిం మన దేశంలో అంతర్భాగంగా లేదు. టిబెట్‌ను ఆక్రమించినట్టు తమ రాజ్యాన్ని కూడా కబళించడానికి చైనా యత్నిస్తుంటే స్వతంత్య్రంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. నిరంకుశ చైనా కంటే ప్రజాస్వామ్యయుత భారత్‌తో కలసి ఉండటమే మేలని సిక్కిం రాజు మన దేశంతో 1950లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రకారం సిక్కిం రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, టెలీ కమ్యూనికేషన్ల వ్యవహారాలను భారత ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయిన తరువాత సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి ఎప్పటికైనా ముప్పు తప్పదని ఆమె గుర్తించారు. అప్పటికే సిక్కిం రాజుకు వ్యతిరేకంగా అక్కడ రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నాయి. ఆ నేపథ్యంలో సిక్కింను భారత్‌లో విలీనం చేయాలని అక్కడి రాజే భారత ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సిక్కింను భారత్‌ లో విలీనం చేశారు. 1971లో పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను విభజించడం, 1975లో సిక్కింను భారత్‌లో విలీనం చేయడం ద్వారా దేశ రక్షణ, సమగ్రతకు ఇందిరాగాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు. సిక్కిం ప్రజలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములయ్యారు. నర్‌ బహదూర్‌ భండారి వరుసగా పదేళు, పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ ఏకంగా 24 ఏళ్లు ముఖ్యమంత్రులుగా పరిపాలించారు. భారత ఫుట్‌బాల్‌ స్టార్‌ భైచింగ్‌ భూటియా, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు(అంతం సినిమా ఫేమ్‌) డేనీ, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గాడుల్‌ సింగ్‌ లామా వంటి ఎందరో ప్రముఖులు సిక్కిం నుంచి రాణించారు. సికింద్రాబాద్‌లో జన్మించిన భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి కూడా సిక్కీం ఛెత్రి తెగకు చెందినవారే.

అరుణాచల్ ప్రదేశ్ మకుటాయమానం

దేశంలో సూర్యుడు తొలిసారిగా ఉదయించే అరుణాచల్‌ ప్రదేశ్‌ ఈశాన్య భారతానికి మకుటాయమానంగా ఉంది. అక్కడి ప్రజలు చైనా అంటే మండిపడతారు. చైనా దురాక్రమణను అడ్డుకోడానికి భారత ప్రభుత్వం సరిహద్దుల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు తమ భూములను ఉచితంగా ఇవ్వడం విశేషం. 1947 నుంచి ‘నార్త్‌–ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజెన్సీ’గా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ను 1972లో కేంద్రపాలిత ప్రాంతంగా, 1987లో రాష్ట్రహోదా దక్కించుకుంది. ప్రజాస్వామ్య భారతంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు అన్నింటా రాణిస్తున్నారు. జియాంగ్‌ అపాంగ్‌ రెండు దఫాలుగా దాదాపు 24ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజీజుతోపాటు డోనీ పోలో ఆధ్యాత్మిక సంప్రదాయ గురువు టాలోం రుబో, నాలుగుసార్లు ఎవరెస్టును అధిరోహించిన అన్షు జంషెన్పా వంటి ఎందరో ఉన్నతస్థానాలకు చేరుకున్నారు. ఇక లద్ధాఖ్‌ భారత పర్యాటక రంగానికి తలమానికంగా నిలుస్తోంది. లద్ధాఖీల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ భారత ప్రభుత్వం ఇటీవల లద్ధాఖ్‌కు కేంద్ర పాలిక ప్రాంతంగా కూడా ప్రకటించింది. దీనిపై లద్ధాఖ్‌ ఎంపీ జమ్యాంగ్‌ నగ్మ్యాల్‌ లోక్‌సభలో చేసిన అద్భుత ప్రసంగం లద్ధాఖీల ఆనందానికి అద్దం పట్టింది. ప్రముఖ విద్యావేత్త, సృజనశీలి సోనం వాంగ్‌చుక్‌ లద్ధాఖ్‌కు చెందినవారే. ఆయన జీవిత కథ స్ఫూర్తితోనే చేతన్‌ భగత్‌ రాసిన నవల ఆధారంగా హిందీలో సూపర్‌హిట్‌ సినిమా ‘త్రీ ఇడియట్స్‌’ తీశారు.

China Imperialism
China Imperialism

 

ఈ విధంగా హిమాలయ ప్రాంత తెగలన్నీ నేపాల్, భారత్, టిబెట్, భూటాన్‌లలో ఎక్కడికక్కడ సహజంగా మమేకమైపోయాయి. 70ఏళ్లుగా చైనా ఆక్రమించిన టిబెట్‌లో స్థానికులకు ఎలాంటి హక్కులు, అధికారాలు లేవు. వారిని ద్వితీయశ్రేణి పౌరులుగానే చూస్తున్నారు. మావో లేవనెత్తిన ఏకజాతి సిద్ధాంతంతో చైనా సామ్రాజ్యవాద వైఖరితో పెట్రేగిపోతోంది. 1962 అనుభవంతో గుణపాఠం నేర్చుకున్న భారత్‌ తమ సైనిక సామర్థ్యాన్ని అమాంతంగా పెంచుకుంది. ఓ వైపు హిమాలయ పర్వత ప్రాంత ప్రజల తిరుగులేని మద్దతు…మరోవైపు అబేధ్యమైన సైనిక సంపత్తితో బలీయంగా ఉంది. అంతర్జాతీయ సమాజం మద్దతూ ఉండటం భారత్‌కు అదనపు బలం. చైనాకు దీటుగా సరిహద్దుల్లో బలగాలను మోహరించడంతోపాటు దౌత్యనీతితో అంతర్జాతీయంగా కూడా చైనాను మరింత ఏకాకిని చేయడం భారత్‌ తక్షణ కర్తవ్యం.

 

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular