Chanakya Neeti: సమాజంలో బతకడానికి దారుంది.. కానీ మంచిగా బతకడానికి కొత్త దారులను వెతుక్కోవాల్సి ఉంటుంది. మంచి, చెడులను తెలుసుకొని మంచి మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించాలి. చెడు మార్గంలో వెళ్లడానికి వ్యక్తిత్వం, నైతిక విలువలు ఉండాల్సిన పనిలేదు. కానీ మంచి మార్గంలో వెళ్లడానికి ఇవన్నీ కావాల్సి ఉంటాయి. అంతేకాకుండా అనేక ఒడిదొడుగులను ఎదుర్కొని ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా మన శత్రువును ఎదుర్కోవడానికి రెండు మార్గాలుంటాయి. ఒకటి బలంగా ఎదుటి వారిని ఢీకొనడం. రెండోది మన విలువను దిగజార్చుకోకపోవడం.
రాజనీతి వేత్త చాణక్య ప్రతీ విషయంలోనూ సమాధానం తెచ్చిపెట్టాడు. ప్రజలకు మార్గదర్శకాలను బోధిస్తూ నైతిక విలువల గురించి చెప్పాడు. ముఖ్యంగా సమాజంలో శత్రువును ఎదుర్కొనే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకుంటే ఎదుటి వారిని ఢీకొట్టడం సులువైన పనేనని సూచించాడు. అయితే వీటికి కొన్ని మార్గదర్శకాలను చెప్పాడు. శత్రువులు రెండు రకాలుగా ఉంటారు. మొదటి శత్రువు మనకు కనిపిస్తారు. కానీ రెండో రకమైన శత్రువు మనకు కనిపించరు. ఈ రెండు రకాల శత్రువులు ప్రమాదకరమైనవారే. అయితే ఏరకమైన శత్రువు ఎదురైనప్పుడు ఎలా ఢీకొట్టాలనేదానిపై కొన్ని సూత్రాలను చాణక్య వివరించాడు.
ఒక వ్యక్తి తాను చేసే మంచి పనుల వల్ల సమాజంలో గౌరవం పొందుతాడు. అయితే ఇలాంటి గౌరవం రావాలంటే ఎంతో సమయం పడుతుంది. కానీ ఈ ఇమేజ్ దెబ్బతినాలంటే క్షణకాలం పట్టదు. అలాంటప్పుడు మనకు వచ్చిన పేరు ప్రఖ్యాతలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దానిని కాపాడుకుంటేనే సమాజంలో మంచిగా బతకగలం.
ప్రతి వ్యక్తికి సౌమ్యత్వం ఎంత బలమో.. అహంకారం అంతకంటే పెద్ద శత్రువు. దీనిని మనం ఎంత పోషిస్తే మనకు బద్ద శత్రువు అవుతుంది. పేరు ప్రఖ్యాతలు వచ్చినప్పుడు దానిని కాపాడుకోవడంలో కొందరు అహంకారాన్ని ప్రదర్శిస్తారు. దీనివల్ల మనిషి విలువ పతనం మొదలవుతుంది.
Also Read: Twitter CEO Indian: ట్విట్టర్ కు మనోడే.. ప్రపంచ టెక్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన భారతీయులు వీళ్లే..
వ్యక్తుల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే సౌమ్యత భావం కలిగి ఉండాలి. అంటే ఇతరులను మీరు వినయంగా ఆదరిస్తే వారు మిమ్మల్ని అదే స్థాయిలో రిసీవ్ చేసుకుంటారు. కొందరు శత్రువులతోనైనా వినయత్వాన్ని ప్రదర్శిస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వినయత్వం రావాలంటే ఆషామాషేం కాదు. మంచి లక్షణాలను అలవర్చుకుంటే ఇతరుల నుంచి మీకు గౌరవం దక్కుతుంది.
జీవితంలో ఏదో సాధించాలన్న తపన, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న లక్ష్యాలు పెట్టుకుంటారు కొందరు. ఈక్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న కష్టలకు భయపడే మనస్తత్వాన్ని త్యజించడం ముఖ్యం. అప్పుడే గమ్యాన్ని చేరుకుంటారు.