Football Legend Pele Passed Away: రొనాల్డో, నెయ్ మార్, మెస్సీ, ఎంబాపే లాంటి ఫుట్ బాల్ ఆటగాళ్ళ ను ఈ తరం చూస్తోంది.. వారు గోల్స్ చేస్తుంటే ఆకాశమే హద్దుగా సందడి చేస్తోంది. ఇప్పుడంటే ఆధునికమైన మైదానాలు, అంతకు మించిన సౌకర్యాలు, కోట్లకు కోట్లు ఇచ్చే స్పాన్సర్లు ఉన్నారు.. కాబట్టి వారికి చెల్లుబాటు అవుతున్నది. కానీ దశాబ్దాల క్రితం ఈ పరిస్థితి లేదు.. అలాంటి స్థితిలో ఫుట్ బాల్ ఆటకు వన్నె తెచ్చినవాడు పీలే. బ్రెజిల్ జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన వాడు.. మూడు సార్లు ఫిఫా కప్ అందించాడు. అలాంటి దిగ్గజ ఆటగాడు… మైదానంలో చిరుతలా పరిగెత్తే మొనగాడు.. క్యాన్సర్ ముందు ఓడిపోయాడు..ఫుట్ బాల్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచుతూ తుది వీడ్కోలు తీసుకున్నాడు. గురువారం రాత్రి( భారత కాలమానం ప్రకారం) తుది శ్వాస విడిచాడు.

పీలే అంటే ఒక బ్రాండ్
82 సంవత్సరాల పీలే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సెప్టెంబర్ 2021 లో తన పెద్ద పేగు మీద ఏర్పడిన క్యాన్సర్ కణితిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించుకున్నాడు.. ఆ తర్వాత అనేక వ్యాధులు అతడిని చుట్టుముట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పీలే కు మొదటి నుంచి ఫుట్ బాల్ అంటే విపరీతమైన ఇష్టం..1958 ప్రపంచ కప్ లో ఆడే సమయానికి అతని వయసు 17 సంవత్సరాలు మాత్రమే.. అంటే అతడికి ఆట అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.. 1958 ప్రపంచ కప్ ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు.. బహుశా సాకర్ చరిత్రలో ఇటువంటి ఘనత మరే ఆటగాడికి సాధ్యం కాకపోవచ్చు. 1958, 1962, 1970 లో మూడు ప్రపంచ కప్ లను బ్రెజిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.. తాను ప్రపంచ కప్ లలో 77 గోల్స్ సాధించి ఆల్ టైం లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు.. అతడి రికార్డును నెయ్ మార్ సమం చేశాడు. అంతేకానీ అధిగమించలేకపోయాడు.. 1962లో గాయం కారణంగా మొదటి గేమ్ కు పరిమితం చేసినప్పటికీ… అతడు ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ చిన్న ఉదాహరణ చాలు పీలే కు ఫుట్ బాల్ మీద ఉన్న ఇష్టాన్ని చెప్పేందుకు.
కెరియర్ లో ఎక్కువ భాగం
పీలే తన కెరీయర్ లో ఎక్కువ భాగం జాతీయ లీగ్ లో కాకుండా రాష్ట్రీయ ఛాంపియన్ షిప్ లో ఆడాడు..అతడు ఎక్కువగా “రియో_ సావో పాలో టోర్నమెంట్, కోపా లిబర్డా డోర్స్”, అంతర్జాతీయ మ్యాచుల్లో ఎక్కువ గోల్ సాధించాడు. ఇందులో రెండు ప్రపంచ కప్ విజయాలు కూడా ఉన్నాయి.. ఈ రికార్డును ఇంతవరకు ఏ ఆటగాడు సాధించలేకపోయాడు.. అంతేకాదు పీలే బ్రెజిల్ గోల్డెన్ జనరేషన్ లో ఒక సభ్యుడు.. అతడి సహచరులు నిల్టన్ శాంటోస్, దీదీ, గారించా, జైర్జిన్హో. వీరంతా కూడా అత్యుత్తమ ఆటగాళ్లు.. పీలేకు బలమైన తోడ్పాటు అందించి బ్రెజిల్ జట్టును ప్రపంచ నెంబర్ వన్ గా నిలిపిన వారు. ఇటీవల ఖతార్ లో సాకర్ టోర్నీలో బ్రెజిల్ జట్టు ఆడిన క్వార్టర్ ఫైనల్ లో ఒక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికింది.. 1970 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో సాకర్ గ్రేట్ చిత్రంతో మైదానంపై భారీ బ్యానర్ ను ప్రదర్శించింది. అందులో పీలే చిత్రం ప్రముఖంగా ఉంది.. ఒకరకంగా చెప్పాలంటే పీలే చివరి రోజుల్లో అతడికి దక్కిన అరుదైన గౌరవం ఇది.

ఇదే అతని మేటి టీం
సాకర్ కప్ ను అర్జెంటీనా గెలిచినప్పటికీ… పీలే స్క్వాడ్ మాత్రం వేరే.. మెస్సి, కైలియన్, ఎం బాపే అతడి ఫేవరెట్ ఆటగాళ్లు.. వీరు ఫుట్ బాల్ ట్రోఫీని ఎత్తుకున్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి పీలే సంబరపడ్డాడు.. అంతేకాదు ” నేడు, ఫుట్ బాల్ తన కథను ఎప్పటిలాగే, మనోహరమైన రీతిలో చెబుతూనే ఉంది” అంటూ రాసుకు వచ్చాడు. ఇంతటి దిగ్గజ ఆటగాడు క్యాన్సర్ ముందు ఓడిపోయాడు. అశేషమైన ఫుట్ బాల్ అభిమానులకు కన్నీళ్లు మిగిల్చి తాను కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు.