Homeట్రెండింగ్ న్యూస్Adultery : కొని తెచ్చుకుంటున్నది ఆహారం కాదు.. అనారోగ్యం

Adultery : కొని తెచ్చుకుంటున్నది ఆహారం కాదు.. అనారోగ్యం

Adultery : నెయ్యి నుంచి నూనె వరకు. పాల నుంచి తేనె వరకు, మాంసం నుంచి మద్యం వరకు.. రోజూ తినే ప్రతీ ఆహార పదార్థం తీవ్రస్థాయిలో కల్తీకి గురవుతున్నాయి. రాష్ట్రంలో ఉరుకుల పరుగుల జీవన శైలిలో ఇంటి తిండికి బదులు బయటి ఆహారంపై ఎక్కువగా ఆధారపడటం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆస్పత్రుల పాలై ఒళ్లు, ఇల్లు రెండూ గుల్ల చేసుకుంటున్నారు. గత నెలలో హైదరాబాద్‌లోని నాచారం రాష్ట్ర ఆహార పరిశోధనశాలలో మొత్తం 459 ఆహార నమూనాలను పరిశీలించగా.. వాటిలో 51 నమూనాలు నాసిరకమని గుర్తించారు. అంటే 11 శాతం మేర ఆహారంలో నాణ్యత ప్రమాణాలు దారుణంగా ఉన్నట్లు తేలింది. వాస్తవానికి భారత ఆహార భద్రత- ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) అంచనాల ప్రకారం, ఆహార పదార్ధాల్లో కనీసం 20 శాతం నాసిరకంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో ఆహారపదార్ధాల నమూనాల సేకరణ పెద్దగా జరగకపోవడంతో విషయం సరి గ్గా వెలుగుచూడటం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పాలు, పాల ఉత్పత్తులు, గోధుమపిండి(ఆటా) నూనెలు, పసుపు, కారం, తేనే, చక్కెర, ఽధాన్యం(గోధుమ, బార్లీ, ఓట్స్‌), పప్పులు, కాఫీ, టీ, మిఠాయిలు, బేకింగ్‌ పౌడర్లు, నాన్‌ ఆల్కహాలిక్‌ పానీయాలు, వెనిగర్‌, కూరపొడులతో ఎక్కువగా కల్తీ జరుగుతోంది.

అనారోగ్య సమస్యలు

తినే ఆహార పదార్థాల్లో కల్తీ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జంతువుల కొవ్వును నెయ్యిలో కలుపుతున్నారు. దీని వల్ల తీవ్ర రక్తహీనతతో పాటు గుండె పరిమాణం పెరుగుతుంది. నూనెల్లో కల్తీ వల్ల కంటి జబ్బులు, కేన్సర్‌, గుండెపోటు, చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుదల ప్రమాదాలు ఉంటాయి. కారంలో రంగు కోసం ఇటుకపొడి, రంపపుపొట్టు కలుపుతున్నారు. వీటి వల్ల ఉదర సంబంధిత సమస్యలతో పాటు కేన్సర్‌ రావచ్చు. ధాన్యాల్లో కల్తీ వల్ల శరీరంలో విషతుల్యత పెరగడమే కాక కాలేయ సమస్యలు తలెత్తుతాయి. కల్తీ కాఫీ పొడి వల్ల డయేరియా, టీపొడి వల్ల కాలేయ ఇబ్బందులు, కల్తీ పంచదార వల్ల మూత్రపిండాల వైఫల్యం, కల్తీ కారంతో కేన్సర్‌, గడ్డలు, రక్తపోటు పెరుగుదల వస్తాయి. ఇక ఐస్‌క్రీమ్‌లలో వాషింగ్‌ పౌడర్‌, నైట్రెట్‌ లాంటివి కలపడం వల్ల శరీరంలోని అవయవాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు

ఆహార కల్తీ ఎక్కడెక్కడ జరుగుతుందో తెలిసినా, దాన్ని అడ్డుకోవడంలో మాత్రం ఆహార భద్రత అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ప్రజల ఫిర్యాదుల్నీ పట్టించుకోవడం లేదు. హడావిడి కోసం నమూనాలు సేకరించడం, ఆ తర్వాత తమకొచ్చే మామూళ్లతో ఆ నమూనాలను పక్కనపెట్టేయడం షరా మామూలుగా మారిపోయింది. కొన్ని జిల్లాల్లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు, తమ లక్ష్యాలమేరకు కూడా నమూనాలను సేకరించడం లేదు. ఇక గత ఏడాది ఆహార భద్రత సూచికలో మాత్రం 17 రాష్ట్రాల జాబితాలో చివరి నుంచి మూడో స్థానంలో, అంటే 15వ స్థానంలో ఉంది. ఫుడ్‌ సేఫ్టీకి సంబంధించి ఐదు విభాగాల్లో వందమార్కులకు గాను రాష్ట్రానికి కేవలం 34.5 మార్కులొచ్చాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version