Crypto Currency: నడమంత్రపు సిరి ఆగద. నరాల మీద పుండు నిలబడనీయదు అని ఒక సామెత ఉంది. ఇది క్రిప్టో కరెన్సీ కి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఈ కరెన్సీ జన బాహుళ్యంలోకి వచ్చినప్పుడు జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా జనం అందులో మదుపు చేశారు. దెబ్బకు మూడు ట్రిలియన్ డాలర్లకు ఆ మార్కెట్ చేరుకుంది. ఇందులో ఎఫ్ టీ ఎక్స్ అనే సంస్థ అతి పెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ గా అవతరించింది. వినియోగదారుల ఉప సంహరణలతో ఆ సంస్థ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్ కు పడిపోయింది. ఫలితంగా ఎఫ్ టీ ఎక్స్ వ్యవస్థాపకుడు బ్యాంక్ మెన్ ఏకంగా 16 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయాడు.

ఏడాది క్రితం నుంచే పతనం
క్రిప్టో కరెన్సీ ఏడాది క్రితం నుంచే బహుళ ప్రాచుర్యం పొందింది. ఈ కరెన్సీ పై అయా దేశాల ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. క్రమంగా ప్రజల్లో సెంటిమెంట్ తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు వడ్డీ రేట్లు, ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇంధన ధరల సంక్షోభం, డ్రాగన్ దేశంలో లాక్ డౌన్ ల వంటి సవాళ్ల వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. తాజాగా ఎఫ్ టీ ఎక్స్ పతనంతో ఇందులో లోపాలు మరోసారి బహిర్గత మయ్యాయి. అతి పెద్ద క్రిప్టో కరెన్సీగా పరిగణిస్తున్న బిట్ కాయిన్ ఒక దశలో 16,000 డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 16,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఏడాది క్రితం ఇదే బిట్ కాయిన్ 69,000 డాలర్ల జీవిత కాల గరిష్ఠానికి చేరుకుంది. అంటే ఇప్పుడు 75 శాతం పతనమైంది..
భారత్ భేష్
ఈ క్రిప్టో కరెన్సీ గురించి మొదటి నుంచి భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇందులో మదుపు చేసే వారిని హెచ్చరిస్తూ వస్తోంది. పైగా దీనికి డిమాండ్ తగ్గించాలని పన్నులు పెంచింది. మొదట్లో దీని పై నిషేధం విధించాలి అనుకున్నది. అనేక చర్చల అనంతరం నిర్ణయం మార్చుకుంది. పైగా ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించుకునేందుకు ఈ కరెన్సీ తయారు చేశారని ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇక భారత్ లో ఉన్న మదుపరుల్లో కేవలం మూడు శాతం మంది మాత్రమే క్రిప్టో కరెన్సీ లో ఇన్ వెస్ట్ చేశారు. ఇక ప్రభుత్వం కూడా ఈ కరెన్సీ లో లావాదేవీలు చేసే వారిపై 30 శాతం పన్ను విధించింది.

డిజిటల్ కరెన్సీ తో జరిగే ఆస్తుల బదిలీ పై ఒక్క శాతం టీ డీ ఎస్ విధించింది. దీనిపై మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఇక డిసెంబర్ 1 నుంచి జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించబోతోంది. క్రిప్టో కరెన్సీ నియంత్రణ బాధ్యతను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనిపై ప్రపంచ దేశాల సహకారం, సమన్వయం కోరే అవకాశం ఉంది. గతంలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ క్రిప్టో కరెన్సీ చాలా ప్రమాద కర అసెట్ క్లాస్ గా అభివర్ణించారు. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ జూనెట్ యేర్లేస్ సైతం ఇదే అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్తం చేయడం గమనార్హం.