Bhagini Hastha Bhojanam 2025: భారతదేశంలో బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అమ్మానాన్న, అక్కా చెల్లె, అన్నా చెల్లె వంటి బంధాలు కలిగిన వారు గౌరవ మర్యాదలు ఇస్తుంటారు. అయితే ప్రతి ఏటా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను నిర్వహించుకుంటారు. అలాగే ప్రతి కార్తీక మాసంలో మరో వేడుకను కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదే భగిని హస్త భోజనంబు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి కార్తీక మాసంలో తదియ రోజు సోదరులను ఇంటికి పిలిచి గౌరవ మర్యాదలు ఇస్తూ వారికి ఆహార పదార్థాలను ఇవ్వడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది అంటారు. అయితే భగిని హస్త భోజనంబు కార్యక్రమం వెనుక ఒక పురాణ కథ ఉంది. ఆ వివరాలు ఏంటి? అలాగే ఈ ఏడాదిలో భగిని హస్త భోజనంబు ఏ రోజు నిర్వహించుకుంటున్నారు?
యమధర్మరాజుకు యమునా అనే చెల్లెలు ఉంటుంది. అయితే తన ఇంటి భోజనానికి యమధర్మరాజును పిలుస్తుంది యమునా. కానీ తీరిక లేకపోవడంతో రావడానికి కుదరదు. అయితే ఒకసారి అనుకోకుండా తన ఇంటికి రావాల్సి వస్తుంది. రాకరాక తన ఇంటికి వచ్చిన అన్నను చూసి యమున ఎంతో సంతోషిస్తుంది. ఈ సందర్భంగా సోదరుడికి సపర మర్యాదలు చేసి ఇష్టమైన వంటలను తయారుచేస్తుంది. తన వంటలకు ఎంతో మెచ్చిన యమధర్మరాజు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. దీంతో లోకకళ్యాణార్థం సోదరీమణుల ఇంటికి వెళ్లి సోదరులు ఎప్పుడైతే భోజనం చేస్తారో వారి జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు అని కోరుతుంది. దీంతో యమధర్మరాజు తధాస్తు అంటాడు. అప్పటినుంచి కార్తీక మాసంలో తదియ రోజున సోదరులు తమ చెల్లెలు ఇంటికి వెళ్లి ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కార్తీక మాసంలో చెల్లెలు ఇంటికి వెళ్లి సోదరులు భోజనం చేస్తే వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని చెబుతున్నారు.
2025 సంవత్సరంలో కార్తీక మాసం శుద్ధ విదియ రోజు భగిని హస్త భోజనంబు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. అంటే ఈ ఏడాది అక్టోబర్ 22న రాత్రి 8.16 గంటల నుంచి అక్టోబర్ 23 రాత్రి 10.46 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం శుభప్రదం అని పండితులు తెలుపుతున్నారు. అంటే అక్టోబర్ 23న భగిని హస్త భోజనంబు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. అయితే భగిని హస్త భోజనం రోజు ఇంటికి వచ్చిన సోదరుడికి ముందుగా తిలకం దిద్దుతారు. ఈ తిలకం దించే సమయంలో ఉంగరపు వేలు ఉపయోగించాలని అంటున్నారు. అయితే అన్న, తమ్ముళ్లు లేనివారు శ్రీకృష్ణుడిని లేదా ధర్మరాజుని తమ సోదరునిగా భావించి పూజిస్తారు. వారికోసం ప్రత్యేకంగా దీపాలు వెలిగిస్తారు. తమ ఆయుష్షును కోరుతూ ప్రార్థిస్తారు.
అయితే భగిని హస్త భోజనంబు కేవలం పండుగ మాత్రమే కాదని.. ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉంటుందని, సోదరుడు, సోదరీమణుల మధ్య ఆప్యాయతను పెంచుతుందని చెబుతున్నారు. సోదరులు తమ చెల్లెలు ఇంటికి వచ్చి సోదరీమణుల ను దీర్ఘాయుష్షు తో ఉండాలని దీవిస్తారు.