
Bhadrachalam Prasadam: భద్రాద్రి రాముడు కే కాదు.. ఆయన ఆలయంలోని ప్రసాద్ అని కూడా ఏళ్ల నాటి చరిత్ర ఉంది. రాముడు దర్శనం అనంతరం భక్తులు ప్రసాదం కొనుగోలుకు మొగ్గు చూపుతారు కాబట్టి.. దాని తయారీలో దేవస్థానం తన ప్రత్యేకతను ప్రదర్శిస్తోంది. భద్రాచలంలో తిరుపతి లడ్డూ దిట్టం మాదిరిగానే లడ్డూ తయారీని చేపడుతున్నది. రామయ్యను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దర్శ నం అనంతరం అత్యంత ప్రాధాన్యమిచ్చేది లడ్డూ ప్రసాదం కొనుగోలుకే. తొలి నాళ్లలో కొబ్బరి పటిక, బెల్లం మిశ్రమాన్ని భక్తులకు అందించిన దేవస్థానం అధికారులు, అనంతరం లడ్డూ ప్రసాదాన్ని 60వ దశాబ్దం చివరల్లో అమలు చేశారు. అయితే ఈ సమయంలో లడ్డూ ప్రసాదాన్ని మరింత మంచిగా తయారు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న దిట్టం(ప్రసాదాల తయారీకి వినియోగించే పదార్థాల వివరాలు, పరిమాణం) ను తెలుసుకొని ఇక్కడ అమలు చేయడం ప్రారంభించారు. కాగా ఆరంభంలో బాదం పప్పు, కుంకుమ పువ్వు, లడ్డూ ప్రసాదంలో వినియోగించిన దేవస్థానం అధికారులు అనతికాలంలోనే ఆ ప్రక్రియకు స్వస్తి పలికారు. అయినప్పటికీ భద్రాద్రి దేవస్థానం లడ్డూ ప్రసాదానికి భక్తుల్లో ఎంతో ఆదరణ ఉంది.
55 ఏళ్ల నుంచి లడ్డూ ప్రసాదం వినియోగం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 55 ఏళ్ల నుంచి లడ్డూ ప్రసాద వినియోగాన్ని చేపడుతున్నారు. భద్రాద్రి దేవస్థానం మేనేజర్‌గా 1959 జూన్ ఒకటిన ఎం. మాధవరావు బాధ్యతలు చేపట్టగా 1968 మే 23 వరకు ఆయన బాధ్యతలు నిర్వహించారు. 1968 మే 24న బాధ్యతలు చేపట్టిన అప్పటి అసిస్టెంట్ కమిషనర్ పి. సీతారామయ్య 1969 జనవరి 31 వరకు భద్రాద్రి దేవస్థానం ఈవోగా పని చేశారు. ఆయన హయాంలోనే భద్రాచలంలో తొలిసారిగా లడ్డూ ప్రసాదం తయారీ ప్రారంభమైంది. ఆనాడు లడ్డూను రూ.1కి విక్రయించే వారు. 1990లో లడ్డూ ధరను రూ.5 చేయగా 2008 వరకు అదే ధర కొనసాగింది.

నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకొని
కాల క్రమేణా పెరిగిన నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు ప్రస్తుతం రామయ్య లడ్డూను వంద గ్రాములు రూ.25కి విక్రయిస్తున్నారు. అలాగే 400 గ్రాముల మహాలడ్డూ ప్రసాదం రూ.100కి విక్రయిస్తున్నారు. . సాధారణ రోజుల్లో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి రోజు పదివేల లడ్డూలు తయారు చేస్తారు. ఇందు కోసం పది మంది సిబ్బంది పని చేస్తారు. శని, ఆదివారాల్లో రోజుకు 20 వేల లడ్డూ తయారు చేస్తారు. ఇందు కోసం 14 మంది సిబ్బంది పని చేస్తారు. ముక్కోటి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తదితర ఉత్సవాల సమయంలో రోజుకు 30 వేల లడ్డూలు తయారు చేస్తారు. ఇందు కోసం 50 సిబ్బంది పని చేస్తారు. ఇదిలా ఉండగా ఈసారి నవమికి దేవస్థానం ఆధ్వర్యంలో రెండు లక్షల చిన్న లడ్డూలను, 10వేల పెద్ద లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. అయితే చిన్న లడ్డూలు లక్ష నిల్వ ఉంచుకొని భక్తుల రద్దీ ఆధారంగా తయారీ హెచ్చు తగ్గులు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.