Bank Service Charges: ఒకప్పుడు నగదు విత్ డ్రా చేసుకోవాలన్నా, నగదు వేయాలన్నా.. బ్యాంకు కు వెళ్లాల్సిందే. అక్కడ చాంతడంతా క్యూ. పైగా అక్కడి అకౌంటెంట్ల విసుర్లు. ఇలాంటివి మనలో చాలా మందికి అనుభవమే! సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్ది కాలానికి డెబిట్, క్రెడిట్ కార్డులు వచ్చాయి. లావాదేవీలు సులభం అయ్యాయి. వీటి రాకతో చాలా మంది బ్యాంకుకు బదులు ఏటీఎమ్ ల బాట పట్టారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అందరికీ డబ్బు విలువ తెలిసి వచ్చింది. “క్యూ” యో మొర్రో అన్నట్టుగా బ్యాంకులు, ఏటీఎమ్ ల ఎదుట బారులు తీరారు. ఒక్కోసారి డబ్బులు లేకపోవడంతో ఎక్కే మెట్టు, దిగే మెట్టు అన్నట్టుగా ఖాతాదారుల పరిస్థితి మారింది. ప్రజలను డిజిటల్ వైపు మళ్లించేందుకు యూపీఐ చేపట్టిన సంస్కరణల వల్ల పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటివి వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడంతా డిజిటల్ పే మెంట్లే! ఇంత వరకూ బాగానే ఉన్నా.. మనకు సేవలు అందిస్తున్నందుకు బ్యాంకులు ఎంత వసూలు చేస్తున్నాయో మీకు తెలుసా?

_ డెబిట్ కార్డుల పై ఇలా
బ్యాంకులు డెబిట్ కార్డుల పై సేవలను ఉచితంగానే చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. భారతీయ స్టేట్ బ్యాంకులో కొన్ని డెబిట్ కార్డుల పై ₹300 జాయినింగ్ ఫీజు ఉంటుంది. వార్షిక ఫీజు 350 ఉన్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జాయినింగ్ ఫీజు 250, వార్షిక ఫీజు 500 వరకు ఉన్నది. రీ ప్లేస్ మెంట్ ఫీజు 150, హెచ్ డీ ఎఫ్ సీ లో జాయినింగ్, వార్షిక ఫీజులు 200 నుంచి 750 దాకా ఉన్నాయి. రీ ప్లేస్ మెంట్ ఫీజు 200 దాకా ఉన్నది. ఐసిఐసిఐ బ్యాంకు లో జాయినింగ్ ఫీజు గరిష్టంగా 1,999, వార్షిక ఫీజు 1499 దాకా ఉన్నది. అయితే ఈ కార్డు ద్వారా ప్రయోజనాలు ఎక్కువ.
Also Read: Nalgonda Rajagattu Revenue: 160 ఎకరాలకు ఓ రెవెన్యూ అధికారి స్కెచ్: ఆ అక్రమం బయటపడింది ఇలా
_ ఏటీఎమ్ పై బాదుడు ఇలా
భారతీయ స్టేట్ బ్యాంక్ ఏటీఎమ్ ను నెలకు ఆరు సార్లకు మించి వినియోగిస్తే రూ. 10 చొప్పున చార్జీ పడుతుంది పరిమితికి మించి ఇతర బ్యాంకు ఏటీఎమ్ లు వినియోగిస్తే రూ. 20 చొప్పున చెల్లించాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అయితే ఉచిత లావాదేవీలు నెలకు ఐదే. ఆ తర్వాత ప్రతీ లావాదేవీ కి రూ. 10 చెల్లించాలి. ఖాతాదారులు ఇతర ఏటీఎమ్ లను వినియోగిస్తే రూ. 20 చెల్లించాలి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఖాతాదారులు నెలలో సొంత ఏటీఎంలను ఐదు సార్లు, ఇతర ఏటీఎంలను మూడుసార్లు ఉపయోగించుకోవచ్చు. ఆపై లావాదేవీలకు రూ.21 చొప్పున చెల్లించాలి.
_ కనీస నగదు నిల్వలపై
రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ లలో ఎస్బిఐ ఫైన్ లు వేయడం లేదు. పొదుపు ఖాతాలో సూచించిన మొత్తాలు లేకపోతే మూడు నెలలకు ఒకసారి పంజాబ్ నేషనల్ బ్యాంక్ 600 వరకు అపరాధ రుసుము వసూలు చేస్తోంది. నగదు నిల్వల ఆధారంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 150 నుంచి 600 మధ్య అపరాధ రుసుము విధిస్తున్నది. ఐసిఐసిఐ 6% లేదా 500 వసూలు చేస్తున్నది.
– అంతర్జాతీయ లావాదేవీలకు
ఒకప్పుడు అంటే విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. కనీసం ఒక ఊరి నుంచి పది మంది దాకా విదేశాలకు చదువు నిమిత్తం, ఉపాధి నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం వారికి అనివార్యమవుతున్నది. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులో డెబిట్ కార్డు ద్వారా ఇతర కరెన్సీల్లో లావాదేవీలు లేదా అంతర్జాతీయ లావాదేవీల కోసం సదరు మొత్తంలో 3.5% ఛార్జ్ చేస్తున్నాయి.. పి ఓ ఎస్, ఈ కామర్స్ లావాదేవీల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మూడు శాతం చొప్పున తీసుకుంటున్నాయి.. విదేశాలకు నగదు బదిలీలకు సంబంధించి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు 500 నుంచి వెయ్యి వరకు తీసుకుంటున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం లావాదేవీలో 0.125% లేదా కనీసం 500 వసూలు చేస్తున్నది. స్విఫ్ట్ బదిలీలకు వంద రూపాయలు అదనంగా తీసుకుంటున్నది. ఎస్బిఐ చార్జీలు కనిష్టంగా 35 , గరిష్టంగా 7000 గా ఉన్నాయి.

_నెఫ్ట్ స్టేట్మెంట్ ల కోసం
నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్ టి జి ఎస్ బదిలీలకు ఐసిఐసిఐ బ్యాంక్ 2.25 నుంచి 45 మధ్య చార్జీలు వసూలు చేస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు నుంచి 15 రూపాయలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 నుంచి 40 రూపాయలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2 నుంచి 49.5 రూపాయల మేర తీసుకుంటున్నది. ఇక డూప్లికేట్ స్టేట్మెంట్ల కోసం బ్యాంకులన్నీ ఖాతాదారుల నుంచి 118 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.
_ మున్ముందు డిజిటల్ పేమెంట్ ల పైనా
ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ ల జోరు పెరిగింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొబైల్ ద్వారా లావాదేవీల సంఖ్య పెరిగింది. దీనికి తోడు పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీలు సులభం అయిపోయాయి. ఈ క్రమంలో ఆన్లైన్ లావాదేవీలపై పన్నులు వసూలు చేసేందుకు యూనియన్ పేమెంట్స్ కమిషన్ యోచిస్తోంది. అయితే దీనిపై రిజర్వ్ బ్యాంకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ పచ్చజెండా ఊపితే వీటిపై కూడా చార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది.
Also Read: Mahesh Babu`s Mother Death: మహేష్ బాబు కుటుంబంలో ఒకే ఏడాదిలో రెండు విషాదాలు