Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా సూచనలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన విప్రో గౌరవ చైర్మన్గా సేవలందిస్తున్నారు. జూలై 24న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని జీవిత సూత్రాల్లో కొన్నింటి గురించి..
విజయం రెండు సార్లు వరిస్తుంది..ఎప్పుడెప్పుడంటే?
‘విజయం ఎప్పుడూ రెండు సార్లు వస్తుంది. మొదటి సారి మెదడులో.. రెండోసారి వాస్తవ ప్రపంచంలో’ అనే భావన అజీమ్ ప్రేమ్జీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఏదైనా సాధించాలంటే ముందుగా మనసులో దాని గురించి స్పష్టమైన లక్ష్యం ఉండాలి. దీని గురించి ముందుగానే సమాధానాలు వెతుక్కోవాలి. ఒక విజయాన్ని మన ఊహల్లో, ఆలోచనల్లో ముందుగా నిర్మించుకున్నప్పుడు.. దాన్ని వాస్తవ జీవితంలో సాధించే దిశగా అడుగులు వేయడం సులభమవుతుంది.
పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలి..
‘నీ లక్ష్యాలను చూసి ఇతరులు నవ్వలేదంటే.. ఆ లక్ష్యాలు చాలా చిన్నవిగా ఉన్నాయని అర్థం’ అనే మాట పెద్ద లక్ష్యాలను సూచిస్తుంది. జీవితంలో సాధించాలనుకునే లక్ష్యాలు మన ప్రస్తుత స్థాయికి మించి ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు అసాధ్యమని భావించే లక్ష్యాలను కూడా సాధించాలనే తపన మనలో ఉండాలి. అయితే పెద్ద లక్ష్యం పెట్టుకోవడం మాత్రమే సరిపోదు. దాన్ని సాధించేందుకు సరైన ప్రణాళిక, నిరంతర ప్రయత్నం, ఓర్పు కూడా అవసరం.
కష్టపడి పనిచేయడం.. నిజాయితీ ముఖ్యం..
కఠోర శ్రమ, పట్టుదల, నిజాయితీ.. ఇవి వినడానికి చాలా సాధారణమైన విషయాలుగా అనిపించినప్పటికీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధించడానికి ఇవే కీలకమైన లక్షణాలని అజీమ్ ప్రేమ్జీ చెప్పే సూత్రం తెలియజేస్తుంది. ప్రతిభ ఉన్నప్పటికీ కష్టపడకపోతే ఆశించిన ఫలితాలు రావు. అలాగే ఒకసారి విఫలమైనంత మాత్రాన ప్రయత్నాన్ని ఆపకుండా పట్టుదలతో ముందుకు సాగాలి.
తెలివైన వారితో కలిసి పనిచేయడమే నాయకత్వం..
‘నాయకత్వం అంటే మీకన్నా తెలివైన వ్యక్తులతో కలిసి పనిచేయడమే’ అనే భావన మంచి నాయకత్వానికి అర్థాన్ని చెబుతుంది. ఒక నాయకుడు తనకంటే ప్రతిభావంతులైన వారిని చూసి భయపడకూడదు. వారి నైపుణ్యాలను గుర్తించి, సరైన అవకాశాలు కల్పించి, బృందంలో భాగస్వాములుగా చేసుకోవాలి.
ఎదిగే కొద్దీ పనులను అప్పగించడం నేర్చుకోవాలి..
‘మీరు ఎదిగే కొద్దీ మీ పనులను ఇతరులకు అప్పగించడం నేర్చుకోవాలి’ అనే సూత్రం ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో మన పనులను మనమే చేసుకోవడం సహజం. అయితే బాధ్యతలు, స్థాయి పెరిగే కొద్దీ ప్రతి పనిని స్వయంగా చేయడం సాధ్యం కాదు. అందుకే నమ్మకమైన వ్యక్తులకు బాధ్యతలను అప్పగించడం ద్వారా వారికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల నాయకుడికి ముఖ్యమైన నిర్ణయాలపై దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది.




