Gambhir- Dhoni: భారత జట్టు సారధిగా మహేంద్ర సింగ్ ధోని సాధించిన విజయాలు అందరికి తెలిసినవే. 2011లో వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకతో జరిగిన పోరులో ధోని ఆటతీరుకు అందరు ముగ్దులయ్యారు. ఆపద సమయాల్లో కూడా కూల్ గా ఉండే తత్వం ఉండటంతో మిస్టర్ కూల్ గా పిలిపించుకునేవాడు. అలాంటి ధోని కెప్టెన్సీపై ఇటీవల విమర్శలు రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సార్లు అతడి సారధ్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టుకు దొరికిన మరో ఆణిముత్యంలా అందరు ప్రశంసించినా కొందరు మాత్రం అతడి కెప్టెన్సీని తప్పుబడుతూ నిందలు వేయడం గమనార్హం.

ఇటీవల గౌతమ్ గంభీర్ అభిమానులు ధోనిని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. ధోనికంటే ముందు గంభీర్ కెప్టెన్ గా ఉన్నాడు. కానీ బీసీసీఐ ధోని ప్రతిభను గుర్తించి అతడిని కెప్టెన్ ను చేస్తే గంభీర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ధోని కెప్టెన్సీలో 2011లో వన్డే వరల్డ్ కప్, 2007లో టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీలు మాత్రమే తెచ్చాడు. కానీ గంభీర్ కెప్టెన్ గా ఉంటే ఇంకా ఎక్కువ ట్రోఫీలు దక్కేవని కామెంట్లు చేస్తున్నారు. వరల్డ్ కప్ సాధనలో ధోని కృషి ఎంత ఉందనేది ప్రేక్షకులకే తెలుసు. కానీ గంభీర్ అభిమానులు ఇప్పుడు ఇలా మాట్లాడటంలో అర్థం లేదని ధోని అభిమానులు సైతం సెటైర్లు వేస్తున్నారు.
ఇటీవల జరిగిన లెజెండ్స్ లీగ్ టోర్నీలో గంభీర్ కెప్టెన్సీలోని ఇండియా క్యాపిటల్స్ జట్లు విజేతగా నిలవడంతో అతడి అభిమానులు రెచ్చిపోతున్నారు. ధోనిపై విమర్శలకు దిగుతున్నారు. ఫైనల్ లో పఠాన్ సారధ్యంలోని ఖిల్వారా కింగ్స్ పై గంభీర్ సేన 104 పరుగుల తేడాతో విజయం సాధించడంతో గంభీర్ అభిమానులు అదేదో గొప్పతనంగా భావిస్తూ ధోనిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ధోని మూడు ట్రోఫీలు గెలిచి ఉండవచ్చేమో కానీ ఆటలో గంభీరే బాగా రాణిస్తాడని కామెంట్లు చేయడంతో వివాదం రేగుతోంది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య చిచ్చుపెట్టే పనిలో భాగంగా ఇలా చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి.
గంభీర్ 2010లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తరువాత న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో 5-0 తేడాతే గెలుచుకోవడం గమనార్హం. ఐపీఎల్ లో కోల్ కత నైట్ రైడర్స్ కు సారధ్యం వహించి 2012, 2014లలో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పుడు లెజెండ్స్ టోర్నీలో విజేతగా నిలిపాడు. ఇలా గంభీర్ సైతం విజయాలు సొంతం చేసుకుని ధోనికి ఏ మాత్రం తీసిపోని ఆటగాడిగా నిరూపించుకున్నా అతడికి కెప్టెన్సీ ఇవ్వడానికి బీసీసీఐ ఎందుకు నిరాకరించిందని అతడి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

ధోని సారధ్యంలో జరిగిన మ్యాచుల్లో కూడా గంభీర్ రాణించాడు. అన్ని మ్యాచుల్లో పరుగుల వరద పారించాడు. ఫలితంగా జట్టును విజయపథంలో నడిపించాడు. దీంతో ఆట గంభీర్ ది రికార్డులు ధోనివి అన్నట్లుగా మారిపోయాయి. గంభీర్ వ్యక్తిగత గొప్పలకు పోకుండా జట్టు విజయమే ధ్యేయంగా ఆడుతూ తనలోని నిస్వార్థ ఆటతీరును ప్రదర్శించాడు. దీంతో భారత జట్టు విజయాల పరంపర కొనసాగించింది. నాయకత్వ లక్షణాల్లో మాత్రం ధోని తీసుకున్న నిర్ణయాలే అతడిని కెప్టెన్ గా నిలబెట్టాయనడంలో సందేహం లేదు.
కెప్టెన్సీ అంటే ఒకరు ఇచ్చేది కాదు. మన ఆటతీరే మనల్ని అందలాలు ఎక్కిస్తుంది. మనకు అది రాలేది ఇది అందలేదు అని కాదు. మనకు సత్తా ఉంటే దానంతటదే వస్తుంది. అంతే కానీ మావాడు కెప్టెన్ అయితే అలా ఉండేది కాదు. ఇలా ఓడేది కాదు అని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అనవసరంగా ఆటగాళ్లలో విద్వేషాలు నింపడమే పనిగా పెట్టుకుంటే బాగుండదు. ఆటగాళ్లలో సమష్టితత్వం ఉంటేనే విజయాలు సొంతమవుతాయనే సంగతి వారికి తెలియదా? ఇలా మతిలేని రీతిలో రాద్ధాంతాలు చేస్తే ఆటగాళ్లలో ఉండే స్నేహతత్వం కూడా దెబ్బతింటుంది. ఫలితంగా సరిగా ఆటపై దృష్టి సారించలేరు. ప్రేక్షకులు సద్విమర్శలు చేయాలే కానీ వ్యక్తిగత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు.