Ashada Amavasya 2025: సైన్స్ ప్రకారం ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య ఏర్పడుతుంది. అయితే వీటిని హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక రోజులుగా భావిస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కొన్నిటిని పండుగలుగా భావించి వేడుకలు నిర్వహించుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. జేష్ట మాసం తర్వాత ఆషాడమాసం ప్రారంభమవుతుంది. 2025 ఏడాదిలో జూన్ 25వ తేదీన అమావాస్య ఏర్పడుతుంది. అయితే ఈ అమావాస్యతో ఆషాడ మాసం ప్రారంభమవుతుంది. అందుకే దీనిని ఆషాడమావాస్య అని అంటారు. మిగతా అమావాస్యల్లో కంటే ఆషాడమాసం అమావాస్యను ప్రత్యేకంగా భావిస్తారు. దీనినే పితృ అమావాస్య అని కూడా అంటారు. అయితే ఈ అమావాస్య రోజున ఏం చేయాలి? అనే వివరాల్లోకి వెళ్దాం..
తెలుగు పంచాంగం ప్రకారం జూన్ 24 సాయంత్రం 6.25 గంటలకు ఆషాడం అమావాస్య ప్రారంభమవుతుంది. జూన్ 25 సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ అమావాస్య కొనసాగుతుంది. అయితే జూన్ 25న ఉదయం అమావాస్య ఉండడంతో ఈ రోజునే ఆషాడ అమావాస్యగా భావిస్తారు. ఆషాడం అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని అంటుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని చుక్కల అమావాస్య అని కూడా అంటారు.
ఈ అమావాస్య రోజున నదీ స్నానం చేయాలని కొందరు భావిస్తారు. ఆ తర్వాత దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుందని చెబుతూ ఉంటారు. గ్రామదేవ చేర్చడం ఆషాడ మాసం గ్రామదేవతలకు ప్రీతికరమైనది ఈ రోజున గ్రామ గ్రామదేవతలను పూజించడం ఎంతో మంచిదని చెబుతుంటారు. అలాగే ఈరోజు రావి చెట్టుకు పూజ చేయడం వల్ల ఎంతో శుభాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
Also Read: Biraja Temple : ఆ శక్తిపీఠం దగ్గర ఎందుకు పిండదానం చేస్తారు? ఇంతకీ ఎక్కడ? ఆ ఆలయం ప్రత్యేకత ఏంటి?
ఆషాడ అమావాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల శుభాలు జరిగితే.. మరికొన్ని పనులు చేయడం వల్ల నష్టాలు జరుగుతాయని చెబుతున్నారు. ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. అలాగే కొత్త వస్తువులను కొనుగోలు చేయడం కూడా మానుకోవాలి. ఇక ఈరోజు జుట్టు కత్తిరించుకోవడం లేదా గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా పెద్దలను అగౌరవపరచకుండా చూడాలి. వ్యాపారం లేదా ఉద్యోగానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేసుకోవాలి.
అలాగే ఆషాడ మాసం రోజున పితృ కార్యాలు నిర్వహించి ఇంటికి కొంతమందిని పిలిచి భోజనం పెట్టడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని చెబుతారు. అలా సాధ్యం కానప్పుడు వారికి కావాల్సిన నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేయాలని అంటున్నారు. ఇక ఈరోజు ఎవరైనా దానం చేయమని ఇంటికి వస్తే ఖాళీగా పంపించకూడదు. ఎందుకంటే కొందరు దేవతలు ఇలా వీరి రూపంలో ఇంటికి వచ్చి బిక్షం అడుగుతారని అంటారు. వారిని సంతృప్తి పరచకపోతే అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.