https://oktelugu.com/

Air Conditioner : ఎండాకాలం వచ్చిందని ఏసీ కొనాలని చూస్తున్నారా.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ACలు కొనుగోలు చేసే సమయంలో వాటిపై కనీస అవగాహన ఉండాలి. మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, ఏ ధరలో ఎలాంటి ఫీచర్లతో ఏసీ వస్తుంది, ఏ కంపెనీ ఏసీ ఎంత ధరలో కొనాలి.. దాని సామర్థ్యం ఏంటి, సర్వీసింగ్ సౌకర్యలు వంటి అనేక అంశాలను ముందుగానే తెలుసుకోవడం మంచింది.

Written By: , Updated On : February 22, 2025 / 03:00 AM IST
Air Conditioner

Air Conditioner

Follow us on

Air Conditioner : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వేసవి రాకముందే సూర్యుడు భగ్గుమంటున్నాడు. సాధారణంగా మార్చి చివర, లేదంటే ఏప్రిల్ నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే గత కొన్నేళ్ల నుంచి వేసవి కాలం ముందుగానే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతోపాటు ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో పట్టణ, నగరాల్లోని ప్రజలు ముందుగానే AC (ఎయిర్‌ కండిషనర్‌) లను కొనుగోలు చేస్తున్నారు. ACలు కొనుగోలు చేసే సమయంలో వాటిపై కనీస అవగాహన ఉండాలి. మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, ఏ ధరలో ఎలాంటి ఫీచర్లతో ఏసీ వస్తుంది, ఏ కంపెనీ ఏసీ ఎంత ధరలో కొనాలి.. దాని సామర్థ్యం ఏంటి, సర్వీసింగ్ సౌకర్యలు వంటి అనేక అంశాలను ముందుగానే తెలుసుకోవడం మంచింది.

AC కొనుగోలు చేయాలనుకుంటే ముందు బడ్జెట్ నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం భారత్‌లో రూ.25వేల నుంచి ఏసీలు అందుబాటులో ఉన్నాయి. మీకు తగిన బడ్జెట్‌లో మంచి బ్రాండ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అయితే అధునాతన ఫీచర్లు, స్మార్ట్ ఫీచర్ల కోసం కొంత ఎక్స్ ట్రా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎండాకాలం సమీపిస్తున్న కొద్ది వాటి రేట్లు పెరుగుతుంటాయి. అందుకే ఎయిర్‌ కండిషనర్‌లు కొనుగోలు చేయాలనుకుంటే చలికాలంలోనే కొని ఉంచుకోవడం ఉత్తమం. ఏసీలను కొనే సమయంలో ముఖ్యంగా బ్రాండ్ మీద దృష్టి పెట్టాలి. నిపుణులు, ఏసీ టెక్నీషియన్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. కొన్న తర్వాత మంచి సర్వీస్ ఇచ్చే బ్రాండ్లను ఎంచుకోవాలి.

ఏసీలు ఇన్వర్టర్‌, నాన్‌ ఇన్వర్టర్‌ మోడల్లలో మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవాలి. ఇన్వర్టర్‌ మోడళ్లు తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయి. అయితే నిర్వహణ, సర్వీస్‌ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. అదే నాన్‌ ఇన్వర్టర్‌ మోడల్స్ అందుబాటు ధరలో ఉంటాయి. వాటి నిర్వహణ కూడా సులభం. అలాగే 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన మోడల్స్‌ను కొనుగోలు చేయాలి. ఎయిర్‌ కండిషనర్‌ కొనుగోలు చేసే సమయంలో విండో, స్ప్లిట్‌ ఏసీలు అంటే ఏందో తెలుసుకోవాలి. మీ ఇంటిని బట్టి ఎలాంటి మోడల్‌ సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోవాలి. విండో ఎయిర్‌ కండిషనర్‌ సింగిల్‌, దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. ధర, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉంటాయి.

స్ప్లిట్‌ ఏసీ సాధారణంగా రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి గది లోపల, మరొకటి గది బయట అమర్చాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ పైపుల ద్వారా అనుసంధానిస్తారు. ఎటువంటి శబ్దం ఉండదు. విండో ఏసీలను అమర్చేందుకు గోడలు బలంగా ఉండాలి. స్ప్లిట్‌ ఏసీలను సన్నని గోడలపైనా అమర్చుకోవచ్చు. ఇంట్లో గదుల విస్తీర్ణం ఆధారంగా ఏసీలను సెలక్ట్ చేసుకోవాలి. చిన్న గదులకు 0.5 టన్ను నుంచి 0.8 టన్ను కెపాసిటీ కలిగిన ఏసీలను ఎంచుకోవాలి. అదే మధ్యస్తంగా ఉన్న గదుల కోసం 1 – 1.5 టన్నులు, పెద్ద రూంల కోసం 2 టన్నుల కెపాసిటీ కలిగిన ఏసీలను కొనుగోలు చేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏసీలు స్లీప్‌ మోడ్‌ ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. సౌండ్‌ లేకుండా మంచి పనితీరును అందిస్తాయి. అవిబాగా పని చేయాలంటే క్రమం తప్పకుండా సర్వీసు చేయించాల్సి ఉంటుంది.