Mango Watermelon side effects: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్‌లో మామిడి, పుచ్చకాయ, సపోటా, ద్రాక్ష వంటి పండ్లు విరివిగా కనిపిస్తాయి. శరీరానికి చల్లదనం, తక్షణ శక్తిని ఇస్తాయని చాలామంది ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే కొన్ని పండ్లను కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మామిడి, పుచ్చకాయ, సపోటా వంటి పండ్లను ఒకేసారి తినడం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.ఈ పండ్లు ఒకేసారి తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో చూద్దాం..
మామిడి పండులో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో పుచ్చకాయలో అధిక నీటి శాతం ఉండగా, సపోటాలో ఫైబర్‌తో పాటు షుగర్ కూడా అధికంగా ఉంటుంది. ఈ మూడు పండ్లను కలిపి తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ ఒక్కసారిగా ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఫలితంగా గ్యాస్, బ్లోటింగ్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
కొంతమందిలో ఈ కాంబినేషన్ వల్ల విరోచనాలు, కడుపునొప్పి, వాంతుల భావన కూడా కనిపించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, డయాబెటిస్ లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఇలాంటి ఫ్రూట్ కాంబినేషన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరంలో షుగర్ స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల అలసట, అసౌకర్యం కూడా కలగవచ్చు.
అలాగే ద్రాక్షతో పాటు పాలు తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ద్రాక్షలో ఉండే ఆమ్ల గుణాలు పాలలోని ప్రోటీన్లతో కలిసి జీర్ణక్రియను మందగింపజేస్తాయని అంటున్నారు. దీని వల్ల కడుపు బరువుగా అనిపించడం, గ్యాస్, మలబద్ధకం లేదా అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఆయుర్వేదం ప్రకారం.. కూడా కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం విరుద్ధం అని అంటారు. అంటే వాటి గుణాలు పరస్పరం విరుద్ధంగా పనిచేసి శరీరానికి ఇబ్బందులు కలిగిస్తాయని వివరిస్తుంది. ముఖ్యంగా పాలు, పుల్లటి పండ్లు లేదా అధిక నీటి శాతం ఉన్న పండ్లను కలిపి తీసుకోవడం మంచిది కాదని సూచిస్తుంది. వైద్యుల సూచనల ప్రకారం.. పండ్లను ఒక్కోటి విడిగా తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే కాకుండా మధ్యలో స్నాక్‌లా తీసుకుంటే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. అలాగే ఒకేసారి ఎక్కువ రకాల పండ్లు తినకుండా పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
