Coffee: సాధారణంగా చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగనిది రోజు ప్రారంభం కాదు. అంతేకాదు పరగడపున బెడ్ మీద ఉండగానే కూడా కొందరు టీ తాగుతుంటారు. చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం ఒక దినచర్య. ఈ క్రమంలోనే టీ తాగిన తరువాతే రోజువారీ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. రోజు ఉదయాన్నే తాగడమే కాకుండా స్నేహితులు వచ్చినా, వేరే అతిథులు వచ్చినా టీ అందించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే రోజుకు ఒక కాఫీ తాగడం మంచిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ మార్నింగ్ టైంలో మాత్రం కాఫీని తీసుకోవద్దని సూచిస్తున్నారు.
ఉదయం పూట కడుపు ఖాళీగా ఉంటుంది..ఆ సమయంలో టీ, కాఫీని తీసుకోవడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. వీటిలో ఉండే కెఫిన్ వలన ఎసిడిటీ పెరుగుతుంది. ఫలితంగా కడుపులో అల్సర్లు రావడం, గుండెలో మంట వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుత్తాయి. కెఫిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపించడం వలన చికాకు కలుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థలో అసౌకర్యానికి గురవుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు. కాఫీలో ఆమ్లత్వం అధికంగా ఉన్న నేపథ్యంలో ఆందోళన, ఒత్తిడి, పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కెఫిన్ మన బాడీలో మూత్రం తయారీని ఎక్కువ చేస్తుంది. దీని వలన పలుమార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడంతో డీహైడ్రేషన్ గురి అవుతారు. అంతేకాకుండా హర్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ అయిన తరువాత టీ, కాఫీలు తాగడం మంచిది.
అందుకే కాఫీ లేదా టీని తాగాలనుకునే వారు ఏదైనా తిన్న తరువాత తీసుకుంటే మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు. దీని వలన ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు యాక్టివ్ గా ఉండొచ్చట.
ఏంటి మీకు కూడా పరగడుపున కాఫీ తాగే అలవాటు కనుక ఉంటే మానుకోండి. ఏదైనా తిన్న తరువాత తాగండి.