New House: ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. దీనికోసం జీవితాంతం కష్టపడే వారు ఉన్నారు. అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకునేవారు ఉన్నారు. ఏది ఏమైనా జీవితంలో ఇల్లు అనేది చాలా కష్టంగా పొందాల్సి వస్తుంది. అయితే ఎంతో కష్టపడి కట్టుకున్న లేదా కొనుక్కున్న ఇల్లు కొన్నాళ్లపాటు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ కొందరు బిల్డర్లు మాత్రం నాణ్యత లేని విధంగా నిర్మించి ఇస్తారు. ఇలా చేయడంవల్ల ఏడాది తిరగకముందే ఇల్లు పగుళ్లు ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో కొందరికి తోచదు. ఒకవేళ బిల్డర్ ను సంప్రదిస్తే పట్టించుకోనప్పుడు ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు. అదేంటంటే?
ఇల్లు కట్టుకోవడం జీవితంలో పెద్ద ప్రాసెస్. అందుకే చాలామంది రెడీమేడ్ ఇళ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కొందరు అపార్ట్మెంట్ లో జీవించాలని అనుకుంటే.. మరికొందరు ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు చేసే సమయంలో ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముందుగా ఇంటికి సంబంధించిన పత్రాలు సరైన విధంగా ఉన్నాయా? లేవా? అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఇంటి నిర్మాణం గురించి పరిశీలించాలి.
కొందరు అపార్ట్మెంట్ లైఫ్ ఇష్టం లేనివారు.. రెడీమేడ్ ఇల్లును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని వారు సొంతంగా ఇల్లు నిర్మించాలని అనుకుంటారు. అయితే సమయం, సరైన అవగాహన లేకపోవడంతో బిల్డర్లకు ఈ బాధ్యతను అప్పగిస్తారు. కొందరు బిల్డర్లు ఎక్కువగా కమిషన్ తీసుకోవాలని ఆశతో నాణ్యత లేకుండా ఇంటి నిర్మాణం చేస్తారు. ఇలా సిమెంట్, కంకర వంటి సామగ్రి లో ఏదైనా నాణ్యత లేకపోతే ఇంటికి పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఏడాది తిరగకముందే పగుళ్లు ఏర్పడితే దీనిని నిర్మించిన బిల్డర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కొందరు బిల్డర్లు పట్టించుకోరు. అంతేకాకుండా తమకు సంబంధం లేదు అన్నట్లు మాట్లాడుతారు.
ఇలాంటి సమస్యలు ఉంటాయన్న ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగం Rera చట్టాన్ని తీసుకువచ్చింది.RERA Act 2016 Clause (3) ప్రకారం ఒక బిల్డర్ ఇల్లును నిర్మించిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు గ్యారెంటీని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ ఐదు సంవత్సరాల లోపు ఆ ఇంటికి పగుళ్లు ఏర్పడినా.. ఇతర సమస్యలు వచ్చినా ఉచితంగా రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా దాటవేస్తే.. ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు ప్రకారం బిల్డర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ ముందుగా బిల్డర్ గురించి తెలుసుకోవాలి. అతడు ఇదివరకు ఎక్కడ నిర్మాణాలు చేశాడు? వాటి పరిస్థితి ఏంటి? అని ఆరా తీయాలి. అంతేకాకుండా అతడు ఎలాంటి మెటీరియల్ వాడుతాడో దగ్గరుండి పర్యవేక్షణ చేసుకోవాలి. అప్పుడే ఇంటికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.