Facebook Layoffs: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.. మొత్తం ఉద్యోగుల్లో 13% అంటే 11,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఇలా ఉద్యోగం కోల్పోయిన భారత వ్యక్తి హిమాన్షు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది. అతడు సంస్థలో చేరిన రెండు రోజులకే నిరుద్యోగిగా మారాడు. అలాగే అతడు ఈ ఉద్యోగం కోసమే భారత్ నుంచి కెనడాకు షిఫ్ట్ అయ్యాడు.

ఖరగ్ పుర్ లో చదివాడు
ఇంజనీరింగ్ విద్యకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఐఐటి ఖరగ్పూర్ లో చదివాడు హిమాన్షు.. అనంతరం ఫ్లిప్కార్ట్, అడోబ్ వంటి కంపెనీల్లో పని చేశాడు. ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీ ఫేస్బుక్ కు చెందిన కెనడా ఆఫీసులో ఉద్యోగం రావడంతో ఎంతో సంతోషించాడు.. కెనడా వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అలా రెండు రోజులు ఆఫీస్ కు వెళ్ళాడో లేదో ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.. మంగళవారం జూకర్బర్గ్ ప్రకటించిన 11,000 మందిలో హిమాన్షు కూడా ఉన్నాడు. ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే తనకు ఇలా జరగడంపై ఆవేదనను లింక్డ్ ఇన్ లో పోస్ట్ పెట్టాడు. ” మెటాలో జాయిన్ అయ్యేందుకు భారత్ నుంచి కెనడా వెళ్లాను. కానీ రెండు రోజులకే నా ఉద్యోగ ప్రయాణం ముగిసింది. ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు.. కెనడా లేదా భారత్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు” అంటూ తన దీనస్థితిని వివరించాడు.. అయితే ఈ పోస్టుకు చాలామంది సానుకూలంగా స్పందిస్తున్నారు. తమకు తెలిసిన ఉద్యోగాల సమాచారం ఇస్తున్నారు.

మెటా పై విమర్శలు
ఇన్నాళ్లు కోట్ల రూపాయల వ్యాపారం చేసిన మెటా.. ఇప్పుడు ఉద్యోగులను తీసివేయడం సరికాదని చాలామంది విమర్శిస్తున్నారు. జూకర్ బర్గ్ తన సంపాదనలో 90 శాతం దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటే గొప్పవాడు అనుకున్నాం, కానీ ఇలా గొంతు పిసికి చంపేస్తాడని అనుకోలేదని కొంతమంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఉద్యోగం వచ్చిందనే ఆశతో భారత్ నుంచి కెనడా వచ్చాడని, ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.. ఇక మొత్తం ఉద్యోగాల్లో 13% మెటా ఒకేసారి తొలగించడం ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే అతి పెద్ద లే ఆఫ్.. ఆదాయం భారీగా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు.. తొలగించిన ఉద్యోగులకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.