Gujarat Assembly Elections: గుజరాత్లో మరో దఫా అధికారం దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో ఏమాత్రం అవకాశం కూడా ప్రత్యర్థి పార్టీలకు ఇవ్వకుండా ప్రణాళికలు అమలులో పెడుతున్నది. ఇందులో భాగంగానే గుజరాత్ లో బిజెపి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా 38 మంది సీటింగ్ ఎమ్మెల్యేలకు భారతీయ జనతా పార్టీ షాక్ ఇచ్చింది. డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరిని పోటీ నుంచి తప్పించింది. గుజరాత్ రాష్ట్రంలో 182 సీట్లు ఉండగా తొలి జాబితాలో 160 నియోజకవర్గాల అభ్యర్థులను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకే ఆయా స్థానాల్లో కొత్త ముఖాలను బరిలోకి దింపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

69 మందికే…
సీటింగ్ ఎమ్మెల్యేల్లో 69 మందికి టికెట్లు దక్కాయి. పటీదార్ నేత హార్దిక్ పటేల్ తో పాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మరో ఏడుగురికి ఈసారి బిజెపి టికెట్లు దక్కాయి.. పిసిసి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా పనిచేసిన హార్దిక్ పటేల్ ఈ ఏడాది మేలో కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరారు. 77 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సుమారు 20 మంది ఈ ఐదేళ్లలో బిజెపిలో చేరారు.. వారిలో చాలామందికి తొలి జాబితాలో టికెట్లు దక్కాయి.. రెండు రోజుల క్రితమే పార్టీలో చేరిన రాజేంద్ర సిన్హ్ రత్వాకూ టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన ఓబీసీ నేత ఆల్ఫేష్ ఠాకూర్, తాజాగా కాంగ్రెస్ నుంచి వచ్చిన భవేష్ కటారాల అభ్యర్థిత్వం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తొలి విడుదల డిసెంబర్ 1న 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో 84 స్థానాలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది.. మలి విడతలో డిసెంబర్ 5న 93 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.. వీటిల్లో 76 స్థానాలకు అభ్యర్థులను బిజెపి ప్రకటించింది.
మోర్బి ఎమ్మెల్యేకు షాక్
మోర్బి తీగల వంతెన కూలి 135 మంది మరణించిన నేపథ్యంలో అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ మీర్జాకు బిజెపి టికెట్ నిరాకరించింది. ఆ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్ అమృతీయకు కేటాయించింది. అంతేనా కూలినప్పుడు ప్రజలను కాపాడేందుకు అమృతీయ నదిలోకి దూకిన వీడియోలు వైరల్ గా మారాయి.

150 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు.. ఈసారి 127 సీట్ల రికార్డును బ్రేక్ చేస్తామన్నారు.. కాగా కొత్త ముఖాలు బిజెపిని బలోపేతం చేస్తాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్సి పటేల్ పేర్కొన్నారు.. అంతమంది సిటింగ్ లకు టికెట్లు ఇవ్వకుంటే తిరుగుబాటు చేయరా అని మీడియా ప్రశ్నించగా ఇది గుజరాత్ ఇక్కడ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేయరు అని స్పష్టం చేశారు. అయితే ఈ సీట్ల కేటాయింపులో మోడీ మార్క్ ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలోనే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బిఎల్ సంతోష్ గుజరాత్లో విస్తృతంగా పర్యటించారు. అప్పుడే పార్టీకి సంబంధించిన బలబలాలను మోడీకి వివరించారు. దీంతో ప్రస్తుత టికెట్లు కేటాయింపు దాని ఆధారంగానే జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.