Inspiring Story: చెట్లు మానవ ప్రగతికి మెట్లు.. అన్న నినాదం పలు సందర్భాల్లో వినిపిస్తూనే ఉంటుంది. చెట్లు లేకుండా మానవులు జీవించలేరు. ఎందుకంటే ఇవి ఇచ్చే ఆక్సిజన్ తోనే స్వచ్ఛమైన గాలి అందుతుంది. అయితే మనుషుల వలె చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ చెట్లు కేవలం ప్రాణం ఉండడమే కాకుండా మనుషుల జీవితాలను కూడా తెలుపుతాయని మరికొందరు అంటున్నారు. చెట్ల జీవితం ఎలా ఉంటుందో మనుషుల జీవితం కూడా అలాగే ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..’
వేర్లు:
ఒక చెట్టు బలంగా ఉండాలంటే దానికి ఉన్న వేరులే ప్రధానం. అంటే వేర్లు అన్ని కలిపి ఒకచోట ఉండడంవల్ల ఆ చెట్టు బలంగా కనిపిస్తుంది. అలాగే మానవ జీవితంలో కూడా కలిసిమెలిసి ఉంటే ఎంతో బలం ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అంతా ఐకమత్యంగా ఉంటే వారి జీవితం ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. అలాగే ఎంత ఒత్తిడి ఉన్నా.. ఎలాంటి సమస్యలు ఉన్నా.. వాటిని పరిష్కరించేందుకు కుటుంబ సభ్యులు ఎంతో సహాయం గా ఉండగలుగుతారు. అలాగే స్నేహితులు, బంధువులతో కూడా సంబంధాలు ఉంచుకోవడం చాలా అవసరం.
రాలే ఆకులు:
ఒక చెట్టుకు ఉన్న ఎండిపోయిన ఆకులు రాలిపోతుంటాయి. అంటే ఆ ఆకులు ఆ చెట్టుకు ఏమాత్రం ఉపయోగకరంగా ఉండవు. అలాగే మనుషుల జీవితాల్లో కూడా అవసరం లేని విషయాలను వదిలివేయడమే మంచిది. అనవసరపు విషయాలతో ఉండటంవల్ల జీవితం పక్కదారికి వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అనవసరపు విషయాలు పట్టించుకోవడం వల్ల సమయం వృధా కూడా అయ్యే అవకాశం ఉంది.
సూర్యుడి కి వంగిపోవడం:
ఒక చెట్టు మొక్కగా ఉన్నప్పుడు దానికి సూర్యుడి శక్తి చాలా అవసరం. ఆసక్తి కోసం మొక్కగా ఉన్న సమయంలో చెట్టు వంగి కనిపిస్తుంది. అంటే చెట్టుగా మారేంతవరకు మొక్క ఒదిగి ఉండగలుగుతుంది. మనుషులు జీవితంలో ఎదిగే వరకు లేదా అనుకున్నది సాధించేవరకు ఒదిగి ఉండాలని ఇది తెలుపుతుంది. ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఇదే సమయంలో మనకు జ్ఞానం పంచే గురువులు లేదా తల్లిదండ్రులకు అనుగుణంగా ఉండడం అలవర్చుకోవాలి. అలా లేకపోతే మొక్క చెట్టుగా మారినట్లు.. మనిషి అనుకున్నది సాధించలేక పోతాడు.
పండ్లు:
ఒక చెట్టు లక్ష్యం పండ్లను ఉత్పత్తి చేయడం. వాటిని ఇతరులు ప్రయోజనం పొందుతారా? లేదా? అన్నది తర్వాత విషయం. అయితే మొక్కగా ఉన్న సమయం నుంచి చెట్టుగా మారి ఆ తర్వాత పండ్లు ఇచ్చే చెట్టుగా మారే వరకు ఎంతో సమయం పడుతుంది. ఈ కాలంలో ఆ చెట్టు లక్ష్యం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంటే ఒక వ్యక్తి కూడా తన జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి ఎంతో సమయం పడుతుంది. ఆ సమయం కోసం ఎంతో కష్టపడాలి. అలాగే ఆ సమయం కోసం వేచి ఉండాలి. ఈ విషయాన్ని ఒక చెట్టు ఇలా చెబుతుంది.
ఈ విధంగా చెట్లు మానవ జీవితానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడడమే కాకుండా మనుషుల జీవితాలను కూడా తెలుపుతూ ఉంటాయి.