Bangalore Rents : నెలకు రూ.2.50 లక్షలు.. బెంగళూరులో అద్దెలు కట్టుకోవాలంటే కిడ్నిలు డొనేషన్‌ చేయాల్సిందే

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ప్రఖ్యాత సంస్థలు భారీ ఎత్తున భవనాలు నిర్మించాయి. కొన్నింటినీ విక్రయించగా, మరికొన్నింటిని అద్దెకు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ అద్దె సముదాయాలు కూడా సరిపోవడం లేదు.

Written By: NARESH, Updated On : July 29, 2023 9:44 pm
Follow us on

Bangalore Rents : ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలేవి? న్యూయార్క్‌, టోక్యో, వాషింగ్టన్‌, ముంబాయి.. ఇదేనా మీ సమాధానం. అయితే ఈ జాబితాలో బెంగళూరును కూడా చేర్చాలి. ఇండియాకు ఐటీ రాజధాని అయినంత మాత్రాన అత్యంత ఖరీదైన నగరం ఎలా అవుతుంది? అనేదేనా మీ అనుమానం? అయితే మీ అనుమానాన్ని తీసి గట్టున పెట్టేయండి అంటున్నారు ఐటీ ఉద్యోగులు. ఐటీ బూమ్‌ వల్ల ఆకాశాన్ని అంటేలా ఇంటి అద్దెల వల్ల తాము ఇక్కడ ఉండలేకపోతున్నామని సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు అంటున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల తమకు ఆశించినంత స్థాయిలో వేతనాలు పెంచకపోయినప్పటికీ ఇంటి యజమానులు మాత్రం ఆకాశాన్ని అంటే స్థాయిలో అద్దెలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో పెరిగిన అద్దెల పై సోషల్‌ మీడియాలో ఒక పోస్టు తెగ వైరల్‌గా మారింది.

బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ప్రఖ్యాత సంస్థలు భారీ ఎత్తున భవనాలు నిర్మించాయి. కొన్నింటినీ విక్రయించగా, మరికొన్నింటిని అద్దెకు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ అద్దె సముదాయాలు కూడా సరిపోవడం లేదు. అసలే ఐటీ కంపెనీలు, పైగా బహుళ జాతి నేపథ్యం ఉన్నవి. ఇలాంటప్పుడు స్థానికంగా ఉండాల్సిందే. ఉద్యోగం చేయాల్సిందే. అందుకే ఉద్యోగులు బెంగళూరులో ఉంటూ కొలువు చేస్తున్నారు. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. కానీ ఎప్పుడయితే పెద్ద పెద్ద కంపెనీలు బెంగళూరు వచ్చాయో.. అప్పుడే అక్కడి స్థానిక ఇంటి యజమానులు అద్దెను పెంచడం మొదలు పెట్టారు. ఎంతలా అంటే అక్కడ చెల్లించే కిరాయితో మన దగ్గర ఓ ఇల్లు కట్టుకునేంత..

బెంగళూరులో 4బీహెచ్‌కే(క్వాడ్రాఫుల్‌ బెడ్‌ రూం) రెంట్‌కు ఉందని ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన వచ్చింది. ఓ ఔత్సాహిక ఐటీ ఉద్యోగి ఎంతో కనుక్కుందామని సంప్రదించారు. దానికి వారు చెప్పిన ఽఅద్దె నెలకు రూ.2.5 లక్షలు. డిపాజిట్‌ 25 లక్షలు చెల్లించాలని చావు కబురు చల్లగా చెప్పేశారు. దీంతో ఆ ఐటీ ఉద్యోగి కొంటెగా అద్దె చెల్లించేందుకు బ్యాంకు రుణం తీసుకునే వెసలుబాటు ఉందా అని అడిగితే అటు నుంచి ఎటువంటి సమధానం రాలేదు. అయితే ఈ ప్రకటన చూసిన కొంతమంది నెటిజన్లు..‘ అద్దె బాగానే ఉంది. అసలే ఇది ఆర్థిక మాంద్యం. జీతాలు పెంచే స్థితిలో కంపెనీలు లేవు. మీరేమో అమాంతం అంతలా పెంచేశారు. ఉద్యోగం చేయాలంటే ఇక్కడ ఉండక తప్పదు. మరి అలాంటప్పుడు అద్దె చెల్లించాలంటే మా కిడ్ని డొనేషన్‌ ఆప్షన్‌ ఉంటే బాగుండు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరో ఐటీ ఉద్యోగి అయితే నేను చేరిన కొన్ని నెలలకే ఇంటి యజమాని అద్దెను ఏకంగా రూ.15,000 పెంచాడని వాపోయాడు.