మూడు రాజధానులుగా పరిపాలనా వికేంద్రీకరణ ను గవర్నర్ ఆమోదించటంతో ఈ వివాదాస్పద అంశం ఒక కొలిక్కి వచ్చినట్లే. ఇక మిగిలిందల్లా కోర్టుల గడప తొక్కటమే . ఇప్పటికే ఈ అంశం హైకోర్టు లో వున్న సంగతి తెలిసిందే. కానీ ఒకసారి గవర్నర్ ఆమోదం పొందటమంటే శాసన ప్రక్రియ ను గవర్నర్ ఆమోదించినట్లే. దీనితో ఈ అంశంలో గుణాత్మక మార్పు జరిగినట్లే భావించాలి. సహజంగానే ఆంధ్రులు ఆవేశపరులనే అపవాదు వుంది. ఇంతకుముందు సమైక్యాంధ్ర విషయం లో, ప్రత్యేక ప్రతిపత్తి కోసం జరిగిన ఉద్యమాలు ఒక్కసారి గుర్తుచేసుకుంటే మంచిది. ఉద్యమాలు చేయటం గురించి వ్యాఖ్యానించటం లేదు. వాటి లాజికల్ ముగింపు గురించి మాట్లాడుతున్నాను. యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియటం తో పాటు ఎప్పుడు ముగించాలో తెలిసినప్పుడే ఫలితం వుంటుంది. లేకపోతే అది బాధాకరంగా మారుతుంది. పై రెండు సందర్భాల్లో నాయకత్వం ఆ ముగింపు సరైన సందర్భంలో చేయకపోవటం తో ఫలితం దారుణంగా వుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతో విభజన ఆగదని రాజకీయాల్లో ఓనమాలు తెలిసిన వాళ్లకు కూడా అర్ధమవుతుంది. ఆ సమయంలో బిల్లు ఒక సైడుగా ఉండకుండా లాబీ చేసివుంటే ఆంధ్రా ప్రజలు ఇంతగా నష్ట పోయేవాళ్ళు కాదు. ఇది ఖచ్చితంగా నాయకత్వ వైఫల్యమే. అలాగే ప్రత్యేక ప్రతిపత్తి విషయం లోనూ రాదనీ తెలిసీ తెగిందాకా లాగకుండా ప్రత్యేక ప్యాకేజి లో వచ్చే డబ్బులు తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడేవి. ఇప్పుడు ప్రత్యేక ప్రతిపత్తి పోయింది, ప్యాకేజి ద్వారా వచ్చే డబ్బులు పోయాయి. ఈ రెండు ఉదాహరణలు మన కళ్ళ ముందు ఇటీవల జరిగినవి. ఆవేశం వుండటం మంచిదే దానితో పాటు ఆలోచన కూడా జత చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు రాజధాని అంశమే తీసుకుందాం.
చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి లో పెట్టాలని నిర్ణయించాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ఆ నిర్ణయం చేసే హక్కు తనకుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే దానిని ప్రపంచంలోనే గొప్ప రాజధాని చేయాలని తాపత్రయ పడటం వుట్టి కెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చేనలేసినట్లు వుంది. ఉద్యోగులకు ప్రతినెలా జీతాల కోసం ఇబ్బందిపడుతూ లక్షల కోట్ల రాజధాని కి ప్లాను చేయటం అత్యాశే. చివరకు అయిదు సంవత్సరాల్లో కేవలం ఐదువేల కోట్లే రాజధాని కి ఖర్చు పెట్టగలిగాడు. అయితే ఇందులో అమరావతి రైతుల పాత్ర మరవలేనిది. 33 వేల ఎకరాలు స్వచ్చందంగా వదులుకోవటం చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఏదేమైనా రాజధాని కి పునాదులు పడి నిర్మాణాలు మొదలైన తర్వాత ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించటం సరైనది కాదు. కాకపోతే ఆ ప్లాన్ ని ఆచరణాత్మకంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకొని కొత్త ప్రభుత్వం పరిపాలన చేస్తే బాగుండేది. అంతేగాని అసలు రాజధాని నే మార్చటం దుస్సంప్రదాయాన్ని నెలకొల్పినట్లయ్యింది. రేపొద్దున ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే ఇంకోచోట పెడతానంటే . తప్పో ఒప్పో ఒక నిర్ణయం జరిగిపోయిన తర్వాత దానిలో మార్పులు చేసుకొని పరిపాలన చేయటం సత్సంప్రదాయం. విశాఖ ను అభివృద్ధి చేయాలనుకుంటే ప్రభుత్వం చేయొచ్చు. రాజధాని ఉంటేనే అభివృద్ధి జరగదు కదా. దీనిపై ఇంతకుముందు ఎన్నోసార్లు విపులంగా చర్చించుకున్నాం కాబట్టి మరలా లోతుల్లోకి వెళ్ళటం లేదు.
గవర్నర్ ఆమోదం తర్వాత కిం కర్తవ్యం?
ఇప్పటివరకూ జరిగిందేదో జరిగింది. ఎవరివాదనలు వాటిలో యోగ్యతా యోగ్యతలు వాళ్లకు వున్నాయి. ఇప్పుడు దానిమీద కూడా చర్చించుకోవటం వలన ప్రయోజనం లేదు. కావాల్సిందల్లా ఇప్పుడు ఎలా ముందు కెల్లాలనేదే. నిన్నటిదాకా గవర్నర్ కేంద్రానికి నివేదిస్తాడని, కేంద్రం జోక్యం చేసుకుంటుందని ప్రజల్లో లేనిపోని భ్రమలు కల్పించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిసినా కేంద్రం పై ఆశలు పెట్టుకోవటం లో అర్ధం లేదు. పార్టీగా బిజెపి రాజధాని అమరావతి లో వుండాలని కోరినా ప్రభుత్వం గా బిజెపి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. పార్టీ వేరు ప్రభుత్వం వేరు. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి వుంది. కన్నా లక్ష్మినారాయణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా వున్నా జరిగేది ఇదే. కాకపోతే ఇంకో లెటర్ అదనంగా గవర్నర్ కు రాసివుండేవాడు. శాసన ప్రక్రియ సబబుగా ఉందా లేదా అనేది ఒక్కటే ఇందులో కీలకమైనది. మిగతావన్నీ నిలబడే వాదనలు కావు. ఈ విషయం లో శాసన సభలకు అధిపతి అయిన గవర్నర్ ఆ ప్రక్రియను ఆమోదించటం నా దృష్టిలో గుణాత్మక మార్పు. అయినా కోర్టులు విచారించ కూడదని ఏమీ లేదు. ఇది చాలా సున్నితమైన అంశం. శాసన అధికారాలు, న్యాయ స్థానం పరిధి రాజ్యాంగం లో స్పష్టంగా విభజించబడ్డాయి. ఇందులో కోర్టు జోక్యం పరిమితంగానే వుంటుంది. అయినా చివరి ప్రయత్నంగా కోర్టులకు వెళ్ళటం సహజమే. కానీ నా అంచనా ప్రకారం కోర్టు జోక్యం చేసుకొనే అవకాశాలు తక్కువగానే వున్నాయి. దీనికి నిమ్మగడ్డ వ్యవహారానికి పోలిక లేదు. ఇప్పటికైనా ఈ అంశానికి ముగింపు పలకాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. ఇకనైనా ఈ అంశానికి ముగింపు పలికి ప్రజా సమస్యలపై, పరిపాలనలో లోపాలపై ప్రతిపక్షాలు దృష్టి సారించాల్సిన అవసరం వుంది.
అమరావతి రైతులకు న్యాయం చేయాలి
ఇప్పుడు కావాల్సిందల్లా అమరావతి రైతుల్ని ఎలా ఆదుకోవాలనేది. ఇంతకుముందే మేము చెప్పినట్లు అమరావతి రైతులు రాజధాని కోసం ఉద్యమం కన్నా తమకు న్యాయం చేయాలని ఉద్యమించి వుంటే బాగుండేది. ఇప్పటికైనా మించిపోయిందిలేదు. భేషిజాలకు పోకుండా , రాజకీయ నాయకుల వలలోకి పడకుండా స్వతంత్రంగా తమకేమికావాలో చెప్పగలిగితే బాగుంటుంది. రాజధాని అమరావతి లో వుంటే వాళ్ళ ప్లాట్లకు గిరాకీ ఉంటుందనేది వాస్తవమైనా ఇప్పటి పరిస్తితుల్లో అది సాధ్యంకానప్పుడు వాళ్ళ ప్రయోజనాలు ఎలా అయితే పరిరక్షించబడతాయో ఆలోచించుకొని ఆచరణాత్మక డిమాండ్లతో ముందుకు రావాలి. ప్రభుత్వం కూడా రైతుల విషయం లో భేషిజాలకు పోకుండా వాళ్ళ డిమాండ్లను వాళ్ళు మెచ్చే విధంగా పరిష్కరించాలి. దానివలన జగన్ కి గుడ్ విల్ వస్తుంది. అంతేగానీ వాళ్ళు ఇప్పటివరకూ తెలుగుదేశానికి మద్దత్తుగా వ్యవహరించారనే కోపంతో ప్రవర్తిస్తే ప్రజలు హర్షించరు. రైతాంగం మంచిచేస్తే గుండెల్లో పెట్టుకుంటారు, లేకపోతే అది జగన్ కే చేటు చేస్తుంది. జగన్ ఆ దిశగా పెద్ద మనసు తో ఆలోచించి రైతులకు మేలుచేస్తాడని ఆశిద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Leave capital issue solve farmers issue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com