
Prakasam District: ప్రకాశం జిల్లాలో ఓ యువతి హత్యకు గురైంది. ప్రేమించిన పాపానికి తనువు చాలించింది. లాడ్జిలో రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని చూసి హత్యగా నిర్ధారించారు. ప్రేమికుడు కోటిరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నమ్మించి హత్య చేసి ఆత్మహత్యగా నమ్మించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పోలీసులు సైతం హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చందానగర్ సీఐ విచారణ చేపట్టారు.
ప్రకాశం జిల్లా(Prakasam District) కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె గొర్రెముందు నాగ చైతన్య (24), నల్లగండ్ల సిటిజన్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నారు. వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే యువతికి సవతి తల్లి మాత్రమే ఉంది. ఇరువురి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు.
ఈనెల 23న ఆస్పత్రి ఎదురుగా ఉన్న లాడ్జిలో రూం అద్దెకు తీసుకున్నారు. మరుసటి రోజు వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపులు తీయడంతో నాగచైతన్య రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ప్రేమికుడు కోటిరెడ్డి ఆమెను పొట్టన పెట్టుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కోటిరెడ్డి పొట్ట, గొంతు దగ్గర కత్తి గాట్లు పెట్టుకుని ఆస్పత్రిలో చేరాడు. దీంతో ఆమె గొంతు కోసుకుందని కోటిరెడ్డి బుకాయిస్తున్నాడు. లాడ్జిని పరిశీలించిన పోలీసులు మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోటిరెడ్డి పైనే అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.