April Fools Day History: మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ ఒకటి వచ్చేసింది. ఏప్రిల్ ఒకటి అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఫూల్స్ డే. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏప్రిల్ ఫూల్ అంటూ తమ స్నేహితులను ఆటపట్టించేవారు. కానీ దీనిని ఎందుకు జరుపుకుంటున్నామో? దాని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో ఎవరూ ఆలోచించేవారు కాదు. అప్పట్లో మీడియా ఇంత బలంగా ఉండేది కాదు. సోషల్ మీడియా అసలు వ్యాప్తిలోనే లేదు. అలాంటప్పుడు ఇలాంటి విషయాల గురించి పెద్దగా ఎవరూ చెప్పేవారు కాదు.. తెలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు.
ఏప్రిల్ ఒకటి అనేది రెండు వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమట. కాబట్టి దీనిని అప్పటినుంచి ఇప్పటివరకు పాటిస్తూనే ఉన్నారు.. అలా అని మీరు నమ్మితే కచ్చితంగా ఏప్రిల్ ఫూల్ అయినట్టే.. అది నిజం కాదు గానీ.. ఇటలీని రోమ్ చక్రవర్తి పరిపాలిస్తుండేవారు. ఆయన భార్య పేరు స్ప్రింగ్ ఏప్రిల్.. ఆమె ఏప్రిల్ నెలలో పుట్టింది.. ఏప్రిల్ ఎలాగూ స్ప్రింగ్ సీజన్ కాబట్టి.. ఆమె పుట్టిన రోజు అందరూ జరుపుకోవాలని రోమ్ చక్రవర్తి ఇటలీ ప్రజలను ఆదేశించాడు.. ఇది నిజం అనుకునేరు.. ఇది కూడా కల్పితమే.. మరోసారి మీరు ఏప్రిల్ ఫూల్ అయ్యారు. కానీ ఏప్రిల్ ఫూల్ వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
1582 లో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 1న జరుపుకునే వారు. కాలం మారుతున్న కొద్ది నూతన సంవత్సరాన్ని జనవరి 1న జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇందులో కొంతమంది ఏప్రిల్ 1 న న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వారు. అలా జరుపుకున్న వారిని చూసి మిగిలినవారు ఏప్రిల్ ఫూల్స్ అంటూ ఏడిపించే వారట. ఇక అప్పటినుంచి ఆ సాంప్రదాయం కొనసాగుతోంది.
యూరప్ ప్రాంతంలో సాల్సా అనే పండుగను మార్చి నెల చివరలో జరుపుకుంటారు. ఆరోజు అందరూ ఓ దేవతను ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటారు. సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అది అలా కొనసాగుతూ కొనసాగుతూ ఏప్రిల్ 1న ఫూల్స్ డే గా మారిపోయిందని అంటుంటారు.
ఇంకా ఎన్నో కథనాలు వ్యాప్తిలో ఉన్నప్పటికీ.. ఏప్రిల్ ఒకటి అనేది తోటి వారిని ఆటపట్టించడానికి మాత్రమే. కానీ కొందరు దీని పేరుతో చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు చేస్తుంటారు. ఎదుటివారిని ఆటపట్టించేందుకు రకరకాల పనులు చేస్తుంటారు. స్థూలంగా మన దైనందిన జీవితంలో చూసేవన్ని నిజాలు కావు.. వినేవన్ని వాస్తవాలు కావు. వేటిని నమ్మాలి? వేటిని నమ్మకూడదు? అనేవి మన విచక్షణ మీదనే ఆధారపడి ఉన్నాయి.