Visakhapatnam bombings 1942 : యుద్ధం.. ఈ మాట వింటేనే భయపడిపోతాం. దేశాల మధ్య ఆధిపత్య పోరు యుద్ధాలకు దారితీసింది అని చరిత్ర చెబుతుంది. అయితే ఇప్పటివరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం భారత్ పై ప్రభావం చూపింది. ముఖ్యంగా మన ఏపీలో విశాఖపట్నం తో పాటు కాకినాడ మూల్యం చెల్లించుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఘటనలను గుర్తుచేసుకుంటున్నారు ఏపీ ప్రజలు. అది కూడా 1942 ‘ఏప్రిల్ 6’ కావడం గమనార్హం. సరిగ్గా 74 సంవత్సరాల కిందట బ్రిటిష్ ఏలుబడిలో ఈ ఘటన జరగడం విశేషం. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
* జపాన్ దాడులు..
రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచ దేశాలను వణికించింది. అగ్రదేశాల మధ్య ఆధిపత్య పోరు ప్రపంచ దేశాలను గడగడలాడించింది. ఈ నేపథ్యంలో 1942 ఏప్రిల్ 6న మనదేశంలో చాలా ప్రాంతాల్లో జపాన్ సైన్యం దాడులు చేసింది. దానికి కారణం బ్రిటన్. బ్రిటిష్ ప్రభుత్వ ఏలుబడిలో ఉండేది మన దేశం. అందుకే మన దేశంపై జపాన్ సైన్యం దాడులు చేసింది. దేశవ్యాప్తంగా బాంబుల వర్షం కురిపించింది. మన రాష్ట్రానికి సంబంధించి తీర ప్రాంతంగా ఉన్న విశాఖ, కాకినాడ పై జపాన్ సైన్యం మెరుపు దాడులు, బాంబులు కురిపించింది.
* అల్లాడిపోయిన సాగర నగరం..
విశాఖపట్నం పై జపాన్ సైన్యం దాడితో నగరవాసులు భయపడిపోయారు. బాంబుల మోతతో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి సమయంలో చాలామంది ప్రాణభయంతో పరిసర పట్టణాలకు తరలిపోయారు. ప్రధానంగా విజయనగరం తో పాటు అనకాపల్లిలో తలదాచుకున్న వారే అధికం. జపాన్ బాంబుల దాడిలో విశాఖ నగరం చాలా విధాలుగా నష్టపోయింది కూడా. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. విశాఖ రావాలంటే నగరవాసులు భయపడిపోయారు. అయితే క్రమేపి యుద్ధ వాతావరణం సన్నగిల్లడంతో నగరవాసులు తిరిగి రావడం ప్రారంభించారు. తమ జీవితాలను కొనసాగించారు.
* తరలిపోయిన ఆంధ్రా యూనివర్సిటీ
విశాఖ నగరం పై జపాన్ యుద్ధ దాడి నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీని గుంటూరుకు తరలించారు. అప్పటికి ఏయూ స్థాపించి 16 సంవత్సరాలు మాత్రమే అవుతోంది. కొద్దికాలంలోనే ఏయు ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా మారింది. అయితే ఈ క్షణం ఏం జరుగుతుందో అన్న భయం వెంటాడింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీని గుంటూరుకు తరలించారు. ఏకంగా అక్కడ మూడేళ్ల పాటు కొనసాగించారు. యుద్ధ వాతావరణం చల్లబడడంతో 1945లో ఆంధ్ర యూనివర్సిటీని తిరిగి విశాఖకు రప్పించారు. అయితే నాడు యుద్ధంలో దెబ్బతిన్న విశాఖ ఇప్పుడు భారత దేశంలోనే ఒక ఉన్నతమైన నగరంగా అవతరించింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా విరాజిల్లుతోంది. నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు విశాఖ నగరవాసులు.