Trump NobelPeacePrize : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్లో ఒక రకమైన నిశ్శబ్దం అలుముకుంది. గంభీరంగా.. అదే సమయంలో లోలోపల అగ్నిపర్వతంలా రగులుతున్న ఆ నిశ్శబ్దం… ఒకే ఒక్క మనిషి ఆవేదనకు అద్దం పడుతోంది. ఆయనే ప్రపంచ శాంతికి “పెద్దన్న” పాత్ర పోషిస్తున్న డొనాల్డ్ జె. ట్రంప్ గారు.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన తర్వాత, మన ట్రంప్‌గారి ముఖంలో చెరిగిపోతున్న భావాలను చూసి వైట్‌హౌస్ సిబ్బంది సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. “నోబెల్ నాకొద్దు, నాకొద్దు” అని గట్టిగా అరిచినా, ఆయన కళ్లలో కనిపించిన ‘చిన్నారి ఆశ’ నేటితో అటకెక్కింది.
* ‘ఇంకెన్ని యుద్ధాలు ఆపాలి?’ – ట్రంప్‌గారి ప్రశ్న
ఆయన కచ్చితంగా తన గదిలో అటూ ఇటూ నడుస్తూ, తలపైన వేసుకున్న తడిగుడ్డ సరిచేసుకుంటూ ఇలా అనుకొని ఉంటారు. “అసలు వీళ్లకు శాంతి అంటే ఏంటో తెలుసా? ఇజ్రాయెల్-హమాస్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం చేయించింది ఎవరు? అస్సలు యుద్ధమే లేకుండా ఉత్తర కొరియా కిమ్‌తో స్నేహం చేసింది ఎవరు? ట్వీట్లతో ప్రపంచ శాంతిని స్థాపించింది ఎవరు?”
#NobelPeacePrize
*Nobel Peace Prize awarded to Maria Corina Machado*Donald Trump right now : pic.twitter.com/s9HjoN8V0V
— Aditya (@adityacasm_) October 10, 2025
“నోబెల్ కమిటీ వాళ్ళు ఏ గ్రహం నుంచి వచ్చారు? వాళ్లకు గ్లోబల్ సెటిల్మెంట్స్ అంటే లెక్కలేదా? ‘ట్రంప్ పీస్ ప్లాన్’ అని నేను చేసినన్ని శాంతి ప్రయత్నాలు ఈ ప్రపంచంలో ఎవరైనా చేశారా? ఇంకెన్ని యుద్ధాలు ఆపాలి, ఇంకేం ‘డీల్ ఆఫ్ ది సెంచరీ’ చేయాలి… ఈ ప్రైజ్ దక్కించుకోవడానికి?” అని ఆయన ఆవేదన చెందుతున్నారేమో!
Donald Trump right now watching someone else got #NobelPeacePrize even after him stopping 69 wars#Trump pic.twitter.com/Pat7vmNqGq
— The last dance (@26lastdance) October 10, 2025
* ఇక ట్రంప్‌గారి తదుపరి చర్య ఏమిటి?
నెట్టింట, ముఖ్యంగా ట్రంప్‌గారి అభిమానుల ‘మేక్ నోబెల్ గ్రేట్ అగైన్’ బృందాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ఈ తీవ్ర నిరాశ నుంచి తేరుకోవడానికి ట్రంప్‌గారు ఏం చేస్తారు? నోబెల్ కమిటీపై, ప్రైజ్ తీసుకున్న వ్యక్తిపై ఆయన ట్విట్టర్‌లో ‘అంతర్జాతీయ దాడి’ కి దిగుతారా? లేదా “నాకు ప్రైజ్ ఇవ్వకపోతే, నేనే మరో ‘ప్రెసిడెన్షియల్ పీస్ ప్రైజ్’ ను స్థాపిస్తా! దాని మొదటి విజేత నేనే!” అని ప్రకటిస్తారా? వచ్చే ఏడాది నోబెల్ కోసం, ఆయన ఏకంగా ఒక చిన్న దేశంపై ‘ప్రశాంతమైన దండయాత్ర’ చేసి, వెంటనే ‘అత్యంత త్వరితగతిన శాంతి’ స్థాపించారా?

ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలు ఆపిన పెద్దమనిషికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరా.. ఎవడ్రా వాడు.. వాడికి ఎంత ధైర్యం ఉంటే మా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరు అంటూ అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు..
ఇక ప్రపంచవ్యాప్తంగా శాంతికి తానే మార్గదర్శినంటూ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనంటూ దరిద్రమైన పాకిస్తాన్ నుంచి మొదలుపెడితే.. ఇజ్రాయెల్ ఆఖరుకు రష్యాతోనూ లాబీయింగ్ చేయించి చివరి నిమిషంలో ‘నోబెల్’ బహుమతికి నామినేట్ చేసుకున్నాడు ట్రంప్.. కానీ ఫలితం మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది..
ఏదేమైనా, ‘నోబెల్ మిస్సయ్యింది’ అనే బాధ… ట్రంప్‌గారిని ఇక ఊరికే కూర్చోనివ్వదు. తన దృష్టిని ప్రపంచ పటంలో ఏ మూలకి మారుస్తారో, ఎవరిపై తన “పీస్ టు ఎండ్ ఆల్ పీసెస్” వ్యూహాన్ని ప్రయోగిస్తారో అని ప్రపంచం భయంతో, ఉత్సాహంతో ఎదురుచూస్తోంది. ట్రంప్ బాధ చూస్తుంటే.. ఊకో ఊకో.. ట్రంప్.. ఏడిస్తే ఎద్దులా ఉంటావు అంటూ సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్, మీమ్స్ తో హోరెత్తిపోతోంది..