Trump hostile towards India: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పీక్స్‌కు చేరింది. ఇప్పటికే తన అనాలోచిన నిర్ణయాలతో అటు అమెరికన్లను, అమెరికాలోని విదేశీయులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు తమతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశాలపై ప్రతీకార సుంకాలతో రెచ్చిపోతున్నారు. మొన్నటి వరకు తమ మిత్రదేశం అంటూ భారత్‌ను ఆకాశానికి ఎత్తిన ట్రంప్ ఇప్పుడు ఇష్టానుసారంగా సుంకాలు విధిస్తున్నారు. దీనినిబట్టి ట్రంప్‌కు మిత్రులు ఎవరూ లేరని అర్థమవుతోంది. ఇక భారత్‌పై అమెరికా విధిస్తున్న సుంకాలకు ఆయన చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నా. వాణిజ్య ఒప్పదం జరగలేదని, భారత్‌తో వ్యాపాం తమకు లాభదాయకంగా లేదని ఆగస్టు 1 నుంచి 25% సుంకాలు విధించారు. ఇక ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్ల కారణంగా అదనంగా 25% సుంకాలను ప్రకటించడం భారత్–అమెరికా సంబంధాలలో కీలకమైన మలుపుగా గుర్తించబడుతోంది. ఈ సుంకాల వెనుక రష్యా ఆయిల్ కొనుగోళ్లతోపాటు, భారత్–చైనా మధ్య మెరుగవుతున్న దౌత్య సంబంధాలు, బ్రిక్స్ దేశాల ఐక్యత ఉంది. బ్రిక్స్ కరెన్సీతో అమెరికన్ డాలర్‌కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు.
Read Also: తగ్గేదేలే.. ట్రంప్ కు కౌంటర్ ఇచ్చిన మోడీ..
రష్యా ఆయిల్ కొనుగోళ్లు..
భారతదేశం ప్రస్తుతం రష్యా నుంచి తన మొత్తం ఆయిల్ దిగుమతులలో దాదాపు 35% కొనుగోలు చేస్తోంది. ఇది 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గణనీయంగా పెరిగింది. రష్యా అందించే డిస్కౌంటెడ్ ధరలు భారతదేశం ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి, ఇది 1.4 బిలియన్ల జనాభా ఇంధన భద్రతను నిర్ధారించడంలో కీలకమైనది. ట్రంప్ ఈ కొనుగోళ్లను ‘రష్యా యుద్ధ యంత్రాన్ని ఆర్థికంగా పోషిస్తుంది‘ అని విమర్శిస్తూ, భారతదేశంపై సుంకాలను విధించారు. అయితే, భారతదేశం తన ఆయిల్ దిగుమతులు పారదర్శకంగా, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయని వాదిస్తోంది. యూరోపియన్ యూనియన్, అమెరికా కూడా రష్యా నుంచి ఇంధనం, రసాయనాలు, ఖనిజ ఉత్పత్తులను దిగుమతి చేస్తున్న నేపథ్యంలో, భారతదేశంపై ఈ ఎంపిక ఎందుకు అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ సుంకాలు రష్యా ఆయిల్ కొనుగోళ్లను నియంత్రించడం కంటే, భారతదేశ ఆర్థిక వృద్ధిని అడ్డుకోవడానికి ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తున్నాయి.
భారత్–చైనా దౌత్య సంబంధాలతో ఆందోళన..
2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్–చైనా సంబంధాలు ఒక సవాలుతో కూడిన దశలో ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. మోదీ ఆగస్టు 31, సెప్టెంబర్ 1న చైనా పర్యటనకు వెళ్లనున్నారు. 2019 తర్వాత ఆయన తొలి అధికారిక సందర్శన. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమ్మిట్ సందర్భంగా జరుగుతోంది. ఈ పర్యటనలో భారత్–చైనా మధ్య వాణిజ్య, సరిహద్దు స్థిరత్వం, బహుపాక్షిక సహకారంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. భారత్–చైనా సంబంధాలు బలపడటం అమెరికాకు ఒక సవాలుగా కనిపిస్తోంది, ముఖ్యంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారతదేశాన్ని ఒక వ్యూహాత్మక భాగస్వామిగా భావించిన నేపథ్యంలో. ట్రంప్ సుంకాలు భారత్–చైనా సహకారాన్ని నిరోధించడానికి ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నాయి, ఇది భారతదేశ ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రాన్ని పరిమితం చేయడానికి ఉద్దేశించినదిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: విశాఖలో మహిళల పేకాట డెన్.. అవాక్కయ్యే విషయాలివీ
డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ చెక్..
బ్రిక్స్(BRIC) (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఉద్భవిస్తున్నాయి. ట్రంప్ బ్రిక్స్ దేశాలను ‘అమెరికన్ డాలర్‌కు వ్యతిరేకంగా‘ ఉన్నాయని విమర్శిస్తూ, భారతదేశ బ్రిక్స్ సభ్యత్వాన్ని సుంకాలకు ఒక కారణంగా పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని పెంచడం, డాలర్ ఆధారిత గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను అన్వేషించడం వంటి చర్యలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు ఒక తాటిపైకి వస్తే డాలర్ ఆధిపత్యానికి ముప్పు ఏర్పడవచ్చని ట్రంప్ భయపడుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. త్రీకార సుంకాలు బ్రిక్స్ ఐక్యతను బలహీనపరచడానికి, భారత్, రష్యా, చైనా కలవకుండా చేయడంలో వ్యూహంగా భావిస్తున్నారు.
ఆచితూచి స్పందిస్తున్న భారత్..
భారతదేశం ట్రంప్ సుంకాలను ‘అన్యాయమైనవి, న్యాయరహితమైనవి‘ అని విమర్శిస్తూ, తన జాతీయ ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రధానమంత్రి మోదీ ‘మేక్ ఇన్ ఇండియా‘ ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులకు ఆర్థిక సహాయం అందించడం, వ్యవసాయం, డెయిరీ వంటి సున్నితమైన రంగాలను రక్షించడం వంటి వ్యూహాలను రూపొందిస్తున్నారు. చైనాతో దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా, భారతదేశం అమెరికా ఒత్తిడిని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎస్‌సీవో సమ్మిట్‌లో రష్యా, చైనాతో చర్చలు భారతదేశం ‘నాన్–అలైన్‌మెంట్‘ విధానాన్ని బలపరచడంతోపాటు, ఆర్థిక సహకారాన్ని పెంచే అవకాశాన్ని అందిస్తాయి.