
వరంగల్ లో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేసి ముగ్గురిని హతమార్చాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. వరంగల్ ఏసీపీ కల్కోట గిరికుమార్ ప్రాథమికంగా తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎల్బీ నగర్ లో మహమ్మద్ చాంద్ బాషా తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆయనకు తన తమ్ముడు షఫీతో ఏడాదిగా పశువుల వ్యాపారం లావాదేవీల్లో వివాదం నడుస్తోంది. సుమారు రూ.కోటి విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న షఫీ బుధవారం చాంద్ బాషా ఇంటిలోనే ఆయన కుటుంబంపై దాడి చేశాడు. తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో షఫీతో పాటు మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు చాంద్ బాషా ఇంటి తలుపులను కట్టర్ సాయంతో తొలగించి లోనికి ప్రవేశించారు. ఇంట్లో నిద్రస్తున్న చాంద్ బాషాతో పాటు ఆయన భార్య సబీరా బేగం, కుమారులు, బావమరిది ఖలీంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు.