https://oktelugu.com/

Kartika month : కార్తీక మాసం విశిష్టత.. ఇలా చేయండి కోరికలు నెరవేరుతాయి..

ఆధ్యాత్మిక సాధన కోసం అనువైన మాసం ఏదంటే చాలా మంది తడబడకుండా చెప్పే మాసం కార్తీకం. పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరు ఆ నెలకు అంటే మాసానికి వస్తుంటుంది.

Written By: , Updated On : November 15, 2024 / 03:00 AM IST
The speciality of Kartika month.. Do this and your wishes will come true..

The speciality of Kartika month.. Do this and your wishes will come true..

Follow us on

Kartika month :  ఆధ్యాత్మిక సాధన కోసం అనువైన మాసం ఏదంటే చాలా మంది తడబడకుండా చెప్పే మాసం కార్తీకం. పౌర్ణమి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరు ఆ నెలకు అంటే మాసానికి వస్తుంటుంది. అదే విధంగా కృత్తికా నక్షత్రంలో జాబిల్లి ఉన్నప్పుడు వచ్చేదే ఈ కార్తిక మాసం. కృత్తికా నక్షత్రం ఎంతో ప్రాధాన్యమైనది. యజ్ఞ సంబంధమైందిగా భావిస్తుంటారు. అధిదేవత అగ్ని. ఒక్కో మాసంలో ఒక్కో దేవతా ప్రధాన్యత ఉంటుంది అంటారు పండితులు. కానీ ఈ మాసంలో విష్ణువు, శువుడులను పూజిస్తారు.

ఎన్నో పండుగలకు వ్రతాలకు, పూజలకు ముఖ్యమైన మాసం ఈ మాసం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగింది మరొకటి కూడా ఉందండోయ్ అదే ఉత్థాన ఏకాదశి. ఆషాడశుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్లిన విష్ణుమూర్తి నిద్ర మేల్కొనే ఎంతో గొప్పదైన, శుభమైనది ఈ రోజు. సన్యాస దీక్షలో ఉన్నవారు చాతుర్మాస దీక్షకు స్వస్తి పలికే రోజు ఈ రోజు అంటారు పండితులు. దేవదానవులు చిలికిన క్షీరసాగర మథనంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిథి క్షీరాబ్ధి ద్వాదశిగా నామకరణం చెందింది. గోపికలు మాధవుడి ఉపాసన చేసే ఈ పౌర్ణమికి రాసపూర్ణిమ అనే పేరు కూడా ఉంది. ఆరోజు సకల దేవతలు సుబ్రహ్మణ్యుణ్ని దర్శిస్తారని స్కాందపురాణం తెలుపుతుంది.

కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు చేసుకునే పూజలను, వ్రతాన్ని భీష్మ పంచకవ్రతం అంటారు. నెల మొత్తం కార్తిక విధులు కుదరని పక్షంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు నిష్ఠగా ఈ వ్రతం చేస్తే సరిపోతుంది అంటున్నారు పండితులు. ఈ మాసంలో ప్రధానంగా కనిపించేవి- దీపారాధన, కార్తిక స్నానం, వృక్షారోపణం, వనభోజనాలు, పురాణ పఠనం లేదా శ్రవణం. సూర్యోదయానికి ముందే కార్తిక స్నానం చేయాలి. అలానే మనిషిలోని అజ్ఞానమనే చీకట్లను తొలగించాలి. జ్ఞానమనే దివ్య జ్యోతిని పొందాలి. దీని కోసం దీపారాధన ఆపై పూజ, పురాణ పఠనం చేయాలి. అంతేకాదు వనభోజనమంటే- ఉసిరి చెట్టు నీడలో చేయాలి. స్వామికి నైవేద్యం పెట్టి అతిథులకు అన్నదానం చేయడం వల్ల మంచి శుభఫలితాలు ఉంటాయి. ఈ మాసంలోనే తులసి మొక్కల్ని ఆరాధన చేయాలి. అంతేకాక విష్ణు ప్రీతికరమైన రావి, తులసి మొక్కకు – పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ, మోదుగ చెట్లను పూజించడం వల్ల కూడా ఎంతో మంచి జరుగుతుంది.

దామోదర వ్రతకల్పం కూడా విశిష్టమైంది. దీన్ని శుక్ల ఏకాదశి వ్రతమం అంటారు. మార్గశిర శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ద్వాదశి నాడు కేశవనామంతో విష్ణుపూజ ఆచరించి ప్రసాదాన్ని స్వీకరించాలి. దీన్ని శుక్ల ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం ఏడాది పొడవునా కొనసాగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు దామోదర నామంతో విష్ణువును ఆరాధించడంతో పరిసమాప్తమవుతుంది అంటున్నారు పండితులు. వ్యక్తికి భౌతిక, బౌద్ధిక, సామాజిక, ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది అంటున్నారు పండితులు. అందుకే ఈ మాసాన్ని జ్ఞాన మాసం అని కూడా అంటారు. ఇక ఏడాదిలో ఒక్క రోజు దీపం పెట్టడం కుదరని వారు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగించవచ్చు.