Telangana Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం తప్పనిసరిగా e-KYC ప్రక్రియను జూలై 31లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఉచితంగా ఈ సేవను అందుబాటులో ఉంచిందని, గడువు ముగిసేలోపు e-KYC చేయించుకోని వారు భవిష్యత్తులో రేషన్ పంపిణీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అర్హులైన ప్రతి లబ్ధిదారు వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. మరి ఈ కేవైసీని ఎలా అప్డేట్ చేసుకోవాలి?
రాష్ట్రంలో నకిలీ రేషన్ కార్డులను గుర్తించి తొలగించడం, నిజమైన అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూడడం కోసం పౌర సరఫరాల శాఖ e-KYCను తప్పనిసరి చేసింది. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను రేషన్ కార్డుతో అనుసంధానం చేయడం ద్వారా లబ్ధిదారుల వివరాలు మరింత పారదర్శకంగా నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు.
లబ్ధిదారులు తమ రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు వెంట తీసుకుని సమీపంలోని రేషన్ డీలర్ వద్ద లేదా మీ సేవ కేంద్రంలో ఉచితంగా e-KYC చేయించుకోవచ్చు. బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుడి వివరాలు సరిచూసి నమోదు చేస్తారు.
జూలై 31 తర్వాత e-KYC చేయించని రేషన్ కార్డుదారులకు భవిష్యత్తులో బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టే ధ్రువీకరణ ప్రక్రియలో e-KYC లేని కార్డులను పరిశీలించే అవకాశం కూడా ఉంది. అందువల్ల చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
గడువు సమీపిస్తున్న నేపథ్యంలో చివరి రోజుల్లో రేషన్ దుకాణాలు, మీ సేవ కేంద్రాల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడే సమీప కేంద్రానికి వెళ్లి e-KYC పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ విజ్ఞప్తి చేసింది. దీంతో భవిష్యత్తులో రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సజావుగా పొందవచ్చని అధికారులు తెలిపారు.
