india womens cricket : గెలవాల్సిన మ్యాచ్ లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓడిపోయింది. గెలుస్తుందనుకుంటున్న తరుణంలో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ గెలిచింది అనేకంటే.. భారత్ చేతులారా ఓడింది అనడం సబబు.. అప్పటిదాకా గెలుపుకు దగ్గరగా ఉన్న టీమ్ ఇండియా.. చివర్లో వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ల ఎదుట సాగిలపడింది. తద్వారా ఊహించని ఓటమి ఎదుర్కొని.. వరల్డ్ కప్ లో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఇంగ్లాండ్ చేతిలో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ టీమ్ ఇండియాకు సెమిస్ వెళ్లే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 289 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించడంలో టీమిండియా 284/6 కు పరిమితమైంది. స్మృతి 88, హర్మన్ 70, దీప్తి 50 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా సులభంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. చివర్లో వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో ఓడిపోయింది. చివర్లో టీమిండియా బ్యాటర్లు బౌండరీలు సాధించలేకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా కు సెమిస్ అవకాశాలు క్లిష్టంగా మారిపోయాయి.
వాస్తవానికి చివర్లో 30 బంతుల్లో 36 పరుగులు చేయాల్సి ఉండగా..6 వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ టీమిండియా ఓడిపోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆటతీరుతో టీమిండియా వరల్డ్ కప్ ఎలా సాధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వదేశంలో వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి సెమీస్ అవకాశాలను అత్యంత క్లిష్టతరం చేసుకుంది.
ఇంతటి కష్టకాలంలో కూడా టీమిండియా సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే రెండు మ్యాచ్లలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పై భారత జట్టు కచ్చితంగా గెలవాలి. దీంతో ఇతర జట్ల ప్రదర్శనతో సంబంధం లేకుండా భారత్ సెమీ ఫైనల్ వెళ్తుంది. ఒకవేళ న్యూజిలాండ్ జట్టుతో జరిగే మ్యాచ్లో టీమ్ ఇండియా గనుక ఓటమిపాలైతే.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్లో గెలవాలి. అంతేకాదు ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. అంతేకాదు ఇతర జట్లతో పోల్చి చూస్తే టీమిండియా మెరుగైన రన్ రేట్ కొనసాగించాలి. అప్పుడే సెమీ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.