Union Cabinet Expansion : కేంద్ర మంత్రివర్గ విస్తరణ పై ఊహాగానాలు వస్తున్నాయి. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుపుతారని ప్రచారం నడుస్తోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి నేతలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. మిత్రపక్షాలకు సైతం పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తారని కూడా పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. అందులో భాగంగా ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో మంత్రి పదవి ఖాయమని సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఏపీ నుంచి. ఏపీ నుంచి బిజెపికి ఒక మంత్రి పదవి ఉంది. అయితే జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉండగా.. ఒక మంత్రి పదవి కూడా కేటాయించలేదు. అయితే ఇప్పుడు జనసేనకు కాకుండా టిడిపికి మరో పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఓ సీనియర్ నాయకుడికి ఆ బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం.
* ముగ్గురుకు మంత్రి పదవులు..
ఏపీ నుంచి ఎన్డీఏ( National democratic Alliance ) తరపున 21 మంది ఎంపీలు గెలిచారు. అందులో 16 మంది తెలుగుదేశం పార్టీ నుంచి.. బిజెపి నుంచి ముగ్గురు… జనసేన నుంచి ఇద్దరు గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎంపీలకు మాత్రమే పరిమితం అయింది. టిడిపి నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవి దక్కింది. కీలకమైన పౌర విమానయాన చూస్తున్నారు ఆయన. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ సైతం కేంద్రమంత్రి అయ్యారు. తొలిసారిగా గుంటూరు నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయినా సరే ప్రధాని మోదీ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. మరోవైపు నరసాపురం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. ఆయనకు అనూహ్యంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. వాస్తవానికి బిజెపి తరఫున రాజమండ్రి నుంచి గెలిచిన పురందేశ్వరికి కానీ.. అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేష్ కు కానీ క్యాబినెట్ పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు బిజెపికి ఏపీ నుంచి మరో మంత్రి పదవి వస్తుందంటే కచ్చితంగా పురందేశ్వరి, సీఎం రమేష్ మధ్య గట్టి పోటీ ఉంటుంది.
* తెరపైకి వేమిరెడ్డి పేరు..
జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి మరొకరు గెలిచారు. అయితే ఈసారి జనసేనకు చాన్స్ ఇస్తే మాత్రం కచ్చితంగా బాలశౌరికి అవకాశం ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఇస్తే మాత్రం సామాజిక ఈక్వేషన్స్ ఖాయం. అయితే ప్రధానంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( vemi Reddy Prabhakar Reddy ) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉండేవారు ప్రభాకర్ రెడ్డి. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు భార్య ప్రశాంతి రెడ్డి కూడా టిడిపిలో చేరారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అయితే నెల్లూరులో పరిస్థితి మారడం వెనుక వేమిరెడ్డి పాత్ర ఉంది. పైగా ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. వేమిరెడ్డికి ఇస్తే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు తో పాటు ప్రకాశం జిల్లాలో అన్ని అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవచ్చని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి పదవికి ఆయన పేరు సిఫారసు చేసినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.