YCP: తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు నీళ్ల రాజకీయాన్ని నమ్ముకున్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో చంద్రబాబును( AP CM Chandrababu) సాకుగా చూపి ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాయి. చంద్రబాబుతో రాజీ పడి తెలంగాణ ప్రయోజనాలను గాలికి వదిలేసారని రేవంత్ పై మండిపడుతున్నారు గులాబీ పార్టీ నేతలు. తెలంగాణ సీఎం రేవంత్ తో రహస్య ఒప్పందం చేసుకొని ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడించి ఆపించానని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది. అయితే అది ముందుగానే నిలిచిపోయిందని.. రేవంత్ చెప్పిన దాంట్లో ఎంత మాత్రం నిజం లేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి హయాంలో తామే ఆ పనులు ఆపించామని వారు చెప్పుకొస్తున్నారు. అయితే ఏపీలో వైసీపీ నేతలు మాత్రం తెలంగాణతో రాజీపడి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధపడుతున్నారు.
* అనుమతులు తీసుకోకుండా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని జగన్ ఆలోచన చేశారు. తన పార్టీకి ఆయువుపట్టుగా భావించే రాయలసీమకు ప్రయోజనం కల్పించాలన్నది జగన్ టార్గెట్. కృష్ణా నదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అయితే సరిహద్దు జలాలకు సంబంధించిన నీటి వినియోగం కాబట్టి కచ్చితంగా అనుమతులు తీసుకోవాలి. అలా అనుమతులు తీసుకున్న తర్వాత ఈ భారీ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. తద్వారా ప్రాజెక్టు పై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోంది. అయితే అప్పటికే తెలంగాణలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్ని రకాల అభ్యంతరాలు తెలంగాణ నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతులు ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది 2020లో. కేవలం ఈ ప్రాంత సెంటిమెంట్తో కూడుకున్న పని కావడంతో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టడం సులువు కాదు. ఆ విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేశారు అంటే దాని వెనుక ఉన్న పరమార్థం ఇట్టే తెలిసిపోతోంది.
* బనకచర్ల ఆలోచన..
మొన్నటికి మొన్న బనకచర్ల ప్రాజెక్టు( Banakkacherla project ) కోసం ఆలోచన చేశారు చంద్రబాబు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించారు. కేవలం సముద్రంలో కలిసిపోతున్న నదీ జలాలను తరలించడం ద్వారా రాయలసీమలో సాగునీటి కొరత లేకుండా చేయవచ్చని భావించారు. అయితే దీనికి తెలంగాణ సమాజం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అదే సమయంలో ఏపీలోని మిగతా రాజకీయ పక్షాల సహకారం కూటమి ప్రభుత్వానికి కరువైంది. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నోరు తెరవలేదు. కానీ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్తో పాటు గులాబీ పార్టీ నేతలు సైతం విమర్శలు చేశారు. కానీ ఏపీకి మద్దతుగా ఈ ప్రాజెక్టు కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం కోరలేదు. అప్పట్లో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో కనీస ప్రస్తావన లేదు. ఎప్పుడైతే తెలంగాణ సీఎం రేవంత్ చంద్రబాబు తో మాట్లాడి ఎత్తిపోతల పథకాన్ని ఆపించానని చెప్పడంతో.. దీనిని ఒక రాజకీయ అంశంగా మార్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* మాజీమంత్రి కీలక ప్రకటన.. రాయలసీమ( Rayalaseema) జల ప్రయోజనాల కోసం ఇప్పుడు వైసీపీ ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించింది. అవసరం అనుకుంటే పాదయాత్ర చేస్తామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటన చేశారు అంటే.. ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. తాము ప్రారంభించిన ప్రాజెక్టు నిలిచిపోవడం నిజం. వాటి అనుమతుల విషయంలో నిబంధనలు పాటించకపోవడం వాస్తవం. కానీ ఈ ప్రాజెక్టు చంద్రబాబు వల్లే నిలిచిపోయిందని చెబుతూ ఇప్పుడు వైసిపి నీళ్ల రాజకీయాలకు శ్రీకారం చుడుతుండడం మాత్రం గమనార్హం. అయితే మరోసారి ప్రజలకు ఈ విషయంలో వాస్తవాలు తెలిస్తే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే.