Street dogs vs Rats : దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం వీధి కుక్కల దాడులు, రేబీస్ వంటి రోగాల వ్యాప్తి నివారణ. అయితే పరోక్షంగా ఇది మరొక సమస్యకు దారి తీసే ప్రమాదం ఉందని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అదే ఎలుకల పెరుగుదల.
– చరిత్ర చెబుతున్న పాఠం
1880లలో పారిస్‌లో రేబీస్ వ్యాప్తి కారణంగా పెద్ద ఎత్తున కుక్కలను చంపేశారు. కానీ ఆ తర్వాత అనుకోని సమస్య వచ్చింది. నగరంలో ఎలుకల సంఖ్య అమాంతం పెరిగి, ప్రజారోగ్యానికి కొత్త ముప్పు తెచ్చింది. కారణం సులభం సహజంగా వీధుల్లో తిరిగే కుక్కలు ఎలుకలపై వేటాడే జంతువులు. అవి లేని పరిస్థితిలో ఎలుకలకు అడ్డుకట్ట పడక, విపరీతంగా పెరిగాయి.
– వీధి కుక్కల పాత్ర
సహజ పరిసర వ్యవస్థలో ప్రతి జంతువుకూ ఒక స్థానం ఉంటుంది. వీధి కుక్కలు ఎలుకల సంఖ్యను కొంతమేర నియంత్రిస్తాయి. ఆహారపు వ్యర్థాలను తిని చెత్త పేరుకుపోవడాన్ని కొంతవరకు తగ్గిస్తాయి. రాత్రి సమయాల్లో అనేక చిన్న జంతువులను వేటాడుతాయి.
– ఎలుకల ముప్పు
ఎలుకలు కేవలం అసౌకర్యం మాత్రమే కాదు, అనేక రకాల రోగాలకు కారణం అవుతాయి. లెప్టోస్పిరోసిస్, ప్లేగు, హాంటా వైరస్ వంటి వ్యాధులు వ్యాపింపచేస్తాయి. ధాన్యం, ఆహార నిల్వలు నాశనం చేస్తాయి.విద్యుత్ వైర్లు, పైపులు కొరికి మౌలిక వసతులకు నష్టం కలిగిస్తాయి.
– సమతుల్య పరిష్కారం అవసరం
వీధి కుక్కలను పూర్తిగా తొలగించడం ఒక సమస్యను తగ్గించవచ్చు కానీ మరొక సమస్యను పెంచే అవకాశం ఉంది. అందుకే స్టెరిలైజేషన్, టీకాలు వంటి పద్ధతులతో కుక్కల జనాభాను నియంత్రించాలి. చెత్త నిర్వాహణను మెరుగుపరచి, ఎలుకలకు ఆహార వనరులు తగ్గించాలి. మున్సిపల్ స్థాయిలో ఎలుకల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి.
వీధి కుక్కలు సమస్య కాదనడం సరికాదు, కానీ అవి లేని పరిస్థితి కూడా పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమే. కాబట్టి ఒక పక్క ప్రజల భద్రతను, మరోపక్క నగర జీవవ్యవస్థ సమతుల్యతను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. చరిత్ర చూపించినట్లుగా సహజ శత్రువులను పూర్తిగా తొలగించడం కొత్త సంక్షోభాలకు మార్గం వేసే అవకాశం ఉంది.